Sri Rama Navami 2024: శ్రీరామనవమికి భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ (మంగళవారం) ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. రామాలయం ఉత్తర ద్వారం  దగ్గర ఈ ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. రేపు (బుధవారం) సీతారాముల కళ్యాణం కోసం సర్వం సిద్ధమైంది. మిథిలా ప్రాంగణంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక... ఎల్లుండి శ్రీ రామ పట్టాభిషేకం జరగనుంది. భద్రాద్రి రాములోరి  కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. భక్తులను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. భక్తుల కోసం తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లతోపాటు చలువ పందిళ్లు వేశారు.  స్వామివారి కల్యాణ వేడుకలు వీక్షించేందుకు మొత్తం 24 సెక్టార్లు ఏర్పాటు చేశారు. ప్రతి సెక్టార్‌లో ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు. 


Also Read: భద్రాద్రి రామయ్య భక్తులకు శుభవార్త - నేరుగా ఇంటికే కల్యాణ తలంబ్రాలు, బుకింగ్ ఇలా!


ఇక... భద్రాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. ఆలయానికి రంగులు వేశారు. విద్యుత్‌ వెలుగులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ పంచవటిలో ఉన్న శ్రీ సీతారాములు, లక్ష్మణ, రావణాసురుడు విగ్రహాలకు రంగులు వేశారు.  రాములోరి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. రాములోరి కళ్యాణాన్ని చూస్తే.. జీవితం ధన్యమైనట్టే అని భక్తులు భావిస్తుంటారు. అందుకే... వేలాదిగా తరలివస్తారు. రాములోరి కళ్యాణం రోజు.. భద్రాద్రి భక్తజన సంద్రంగా మారుతుంది.  ఇసుకేస్తే రాలనంతంగా జనం.. భద్రాచలానికి తరలివస్తారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఆలయ పరిసరాల్లోని హోటళ్లు భక్తులతో నిండిపోయాయి. https://bhadradrit  emple.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు, వసతి గదుల బుక్‌చేసుకోవచ్చని తెలిపారు. భద్రాచలం వచ్చే భక్తులకు గోదావరి కొత్త వారధిపై నుంచి రాకపోకలు నిలిపివేశారు. 59ఏళ్ల తర్వాత భద్రాచలం వద్ద గోదావరి రెండో వారధి  ప్రారంభమైంది. ఆ వారధి పైనుంచే భద్రాచలానికి రాకపోకలు సాగిస్తున్నారు. 


Also Read: జై శ్రీరామ్ - మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పయండిలా!


భద్రాచలం ప్రాంతానికి చెందిన రామాయణ గాధ ఎంతో విశిష్టమైంది. భద్రాచల రాముడిని భోగా రాముడని, దుమ్ముగూడెం రాముడిని ఆత్మ రాముడని, పర్ణశాల రాముడిని శ్లోక రాముడిగా పిలుస్తారు. వీరికి రామాయణంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.  అయితే పర్ణశాల పుణ్యక్షేత్రంలో సీతారాముల వారు 14 ఏళ్లు అజ్ఞాతవాసం చేశారనే ఉద్దేశంతో... భక్తులు ఈ ప్రాంతాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతారు. గోదావరి నదీ తీరాన పర్ణశాల వద్ద పంచవటి, నారచీరల ప్రాంతం పర్ణశాల చరిత్రకు సేజీవ  సాక్షులుగా మిగిలాయి. ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న పర్ణశాల పుణ్యక్షేత్రం... సీతారాముల కల్యాణానికి సిద్ధమైంది. పర్ణశాల ప్రాంతాన్ని సుందరంగా అలంకరించారు. భద్రాచలం రామయ్యను దర్శించుకున్న ప్రతి భక్తుడు పర్ణశాల రామయ్యను  దర్శించుకుని పరవశించిపోతారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పర్ణశాల పుణ్యక్షేత్రానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రసాద పథకం కింద ప్రత్యేక నిధులు కూడా మంజూరు చేసింది.


Also Read: ఆ గుహలో రావణుడి అస్తిపoజరం - అక్కడే నిధి , నాగబంధం!


భద్రాద్రి రామయ్య కల్యాణ వేడుకలు ఉగాది నుంచే ప్రారంభమయ్యాయి. ఉగాది పండుగ సందర్భంగా... స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఆ తర్వాత ఉత్సవాంగ స్నపనంతో వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ  బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. అదే రోజు నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మూలవరులకు అభిషేకం, బేడా మండపంలో ఉత్సవమూర్తులకు ఉత్సవాంగ స్నపనంతో బ్రహ్మోత్సవాలు  ప్రారంభమయ్యాయి. ఇక రేపటి కల్యాణం కోసం మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేయనున్నారు. దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఉచితంగా దర్శనం కల్పించనుంది దేవస్థాన కమిటీ. ప్రత్యేక అర్చనలు, స్పెషల్ దర్శనాలను నిలిపివేసింది. నిరంతరాయ అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతోంది.