Driver Hit Man With Car In Ananthapuram: మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ వ్యక్తిని ఢీకొనగా.. కారుపై పడ్డ వ్యక్తిని 18 కిలో మీటర్లు తీసుకెళ్లాడు. ఈ దారుణ ఘటన అనంతపురంలో (Ananthapuram) సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూడేరు మండలం చోళ సముద్రానికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ జిన్నె ఎర్రి స్వామి (35)కి ఆత్మకూరు మండలంలోని పి.సిద్దరాంపురానికి చెందిన మంజులతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎర్రిస్వామి తన వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్ పై సిద్ధరాంపురానికి వెళ్లి.. ఆదివారం రాత్రి అనంతపురానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. వై.కొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారిపైకి రాగా.. ఇదే సమయంలో కల్యాణదుర్గం వైపు వెళ్తున్న కారు ఎర్రిస్వామి బైక్ ను ఢీకొట్టింది. దీంతో ఎర్రిస్వామి ఎగిరి కారుపై పడి మృతి చెందాడు.


కారుపైనే మృతదేహంతో


అయితే, మద్యం సేవించి ఉన్న కారు డ్రైవర్ ఇది గమనించకుండా వాహనంపై మృతదేహంతోనే 18 కిలో మీటర్లు తీసుకెళ్లాడు. అనంతరం హనిమిరెడ్డిపల్లి వద్ద కారుపై మృతదేహం పడి ఉన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు కారును ఆపారు. విషయం తెలుసుకున్న డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది. మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.


Also Read: CM Jagan: సీఎం జగన్ పై రాయి దాడి చేసింది ఆ యువకుడే! - నిందితులను గుర్తించిన సిట్