Khammam BRS :   ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్‌ నేతలు పెద్ద ఎత్తున రాజీనామా బాట పట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కనకయ్యతో పాటు ఆయన అనుచరులు, ఇల్లందు నియోజకవర్గవ్యాప్తంగా పలువురు నాయకులు బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. మొత్తం 56 మంది సర్పంచ్‌లు, 26 మంది ఎంపీటీసీలు కారు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. వీరంతా  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.  ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు.


పొంగులేటి అనుచరవర్గం అంతా కాంగ్రెస్ లోకే ! 


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి వెంట చాలామంది వెళ్లే అవకాశం కనిపిస్తోంది.   జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం సీనియర్ నేత, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావ్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, మేకల మల్లిబాబు యాదవ్, రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ వెంట ఉన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా పొంగులేటి వెంట వెళ్తారని ప్రచారం జరుగుతోంది. వీరందర్నీ ఇంకా బీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదు. వారే రాజీనామాలు చేస్తున్నట్లుగా ప్రకటించారు.  


ఖమ్మంపై పూర్తి స్థాయి ఆధిపత్యం పొంగలేటిదేనా ?                    


బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కొన్ని నియోజకవర్గాలకు తన తరపున అభ్యర్థుల్ని కూడా ఖరారు చేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లినా వారందరికీ టిక్కెట్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చాు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ చేరడంతో రెండు నియోజకవర్గాలు తప్ప..అన్ని నియోజకవర్గాల బాధ్యతలూ ఆయనకే ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో చేరికలు భారీగా ఉండటం రాజకీయవర్గాలు సహజ పరిణామంగా చెబుతున్నాయి. 


జూపల్లితో  పాటు కూడా పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరిక 


మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అచ్చంపేట, గద్వాల, నాగర్​ కర్నూల్, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, మక్తల్ నియోజక వర్గాల్లో సొంత వర్గం ఉంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్​ తరఫున కొల్లాపూర్ లో పోటీ చేసిన జూపల్లి..  కాంగ్రెస్​ అభ్యర్థి బీరం హర్ష వర్ధన్ ​రెడ్డి చేతిలో ఓడిపోయారు. హర్ష వర్ధన్​రెడ్డి గెలిచిన తర్వాత బీఆర్ఎస్​లో చేర్చుకోవడంలోనూ వీరిద్దరూ కీ రోల్​ పోషించారన్న టాక్​ ఉంది. జూపల్లి సస్పెన్షన్​కు గురి కావడంతో ఉమ్మడి జిల్లాలోని అసమ్మతి నేతలు ఆయనతో టచ్​లోకి వచ్చినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్​కు రాజీనామా చేసిన వనపర్తి జడ్పీ చైర్​పర్సన్​ లోక్​నాథ్​ రెడ్డి, పెద్దమందడి మేఘారెడ్డి, వనపర్తి కిచ్చా రెడ్డితో జూపల్లి అనుచరులు మాట్లాడారని, తమతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నట్లుగా తెలుస్తోంది.