మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్ ద్వారా ఎవరైనా తమ సమస్యను చెప్పుకుంటే సంబంధిత అధికారులతో ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తారు. ఎవరికైనా వైద్యం అవసరమైతే మంత్రి కేటీఆర్ ఆఫీస్ కు సిఫార్సు చేస్తే వాళ్లు బాధితుల సమస్యను తెలుసుకుని తగిన సాయం అందిస్తారు. తాజాగా సికింద్రాబాద్ బౌద్ధ నగర్ లో ఉండే చిన్నారి కేటీఆర్ కు ఓ లేఖ రాశాడు. తమ ఇంటి వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది పుట్ పాత్ ఏర్పాటు చేస్తామని గుంతలు తవ్వారని, కానీ ఇప్పటి వరకూ ఎలాంటి ఫుట్ పాత్ కట్టలేదని లేఖ రాశాడు.










తనకు వచ్చిన ఇంగ్లీషులో రాసిన ఈ లెటర్ ను చిన్నారి బంధువు  ఒకరు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కు టాగ్ చేశారు. ఈ లెటర్ చూసి చిన్నారి ప్రశ్నించే తత్వాన్ని మెచ్చుకుని సంబంధిత అధికారులు ఆ బాలుడు వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దీంతో సికింద్రాబాద్ జోనల్ అధికారులు చిన్నారి ఇంటికి పరుగులు తీశారు. బౌద్ధ నగర్ లోని కార్తికేయను కలిశారు. ఇప్పటికే ఫుట్ పాత్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, సోమవారం నుంచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మంత్రి కేటీఆర్ సూచించినట్లు చిన్నారితో ఫొటోలు దిగి, వాటిని మంత్రికి ట్వి్ట్టర్ లో టాగ్ చేశారు. చిన్నారి చేసిన క్యూట్ కంప్లైంట్ పై మంత్రి కేటీఆర్ స్పందించిన తీరుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


కొడుకు కోసం పరితపిస్తున్న తల్లి కోసం 


ట్విట్టర్ ద్వారా తన దృష్టికి వచ్చే సమస్యలను తీర్చడంలో మంత్రి కేటీఆర్ ముందుంటారు. ఈ-వీసా రద్దు కావడంతో అమెరికాలోనే ఉండిపోయి చావుబతుకుల్లో ఉన్న తల్లిని చూసే మార్గం లేక ఆవేదన చెందుతున్న ఓ వ్యక్తికి కేటీఆర్ సాయం చేశారు. వరంగల్‌కు చెందిన మాదాడి వినయ్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌కు గురువారం ఓ ట్వీట్ చేశారు. తన తల్లి చావుబతుకుల్లో ఉందని, తన కోసం పరితపిస్తోందని అన్నారు. అమెరికాలో ఈ-వీసాలు చేయడంతో స్వదేశానికి వచ్చే మార్గం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వరంగల్ వచ్చే అవకాశం కల్పించాలని ఆయన ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ ను కోరారు. వినయ్‌రెడ్డి ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేశారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయ అధికారులకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు వినయ్‌రెడ్డికి అత్యవసర వీసా మంజూరు చేశారు. దీంతో వినయ్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు.