ప్పటి వరకు మనం ఆవు, పాలు, మేక పాలు గురించి మాత్రమే విన్నాం. చివరికి గాడిద పాలు తాగేవారి గురించి కూడా తెలుసుకున్నాం. కానీ, ఈ చిన్నారి ఏకంగా ఏనుగు పాలే తాగేస్తోంది. పైగా.. ఏనుగు కిందకు దూరి.. దాని పొదుగును నొక్కుతూ మరీ పాలు తాగేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది.


గోలాఘాట్ జిల్లాకు చెందిన హర్షిత బోరా అనే మూడేళ్ల చిన్నారి ఏనుగు వద్ద ఆడుకుంటూ కనిపించింది. ఈ సందర్భంగా ఆమె ఏనుగు పొదుగును నొక్కుతూ పాలు తాగింది. హర్షిత మావాటి కుటుంబానికి చెందిన చిన్నారి అని తెలుస్తోంది. ఆ ఏనుగును ‘‘బిను బిను’’ అని ముద్దుగా పిలుస్తూ దాని దగ్గరే ఆటలు ఆడుతోంది. ఆ చిన్నారి పాలు పిసికి తాగుతున్నా.. ఏనుగు అలా చూస్తేనే ఉంది. ఆ సమయంలో పెద్దలు కూడా ఏనుగుకు సమీపంలోనే ఉన్నారు. ఏనుగులు ఒక్కోసారి చాలా ఆగ్రహంతో ఉంటాయి. తొండంతో పట్టుకుని విసిరేయడమే కాకుండా.. కాళ్లతో తొక్కి చంపేస్తాయి. ఈ వీడియో చూసిన నెటిజనులు.. ‘‘లక్కీగా ఆ ఏనుగు చిన్నారిని ఏమీ చేయలేదు కాబట్టి సరిపోయింది. దానికి చిరాకు వస్తే చిన్నారి ప్రాణాలకు హాని కలిగేది’’ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






సాధారణంగా ఏనుగులు తమ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తాయి. అలాగే, మనుషులతో కూడా స్నేహంగా ఉంటాయి. తనకు నచ్చినవాళ్లు దూరమైతే కన్నీళ్లు కూడా పెట్టుకుంటాయి. కానీ, ఒక్కోసారి అవి ఉగ్రరూపాన్ని చూపిస్తుంటాయి. మావాటి మాటను కూడా పట్టించుకోవు. అలాంటి సమయంలో ఏనుగులకు దూరంగా ఉండాలి.