Secunderabad Fire Accident : సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ షోరూమ్ అగ్ని ప్రమాదంలో ముగ్గురు  సజీవదహనం అయ్యారు. అయితే అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్ తెలిపారు.  మంటలు వ్యాపిస్తున్న సమయంలో మీటర్లలో విద్యుత్ సరఫరా ఉందన్నారు.  ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే సబ్ స్టేషన్ లో ట్రిప్ అయ్యేదని,  కానీ అలా జరగలేదన్నారు. గురువారం ఉదయం 11.20 గంటలకు ఫోన్ రాగానే విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు. భవనానికి మాత్రం విద్యుత్ సరఫరా నిలిపేశామన్నారు. చుట్టుపక్కల కాలనీలకు సాయంత్రం 6.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్దరించామన్నారు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే మీటర్లు, వైర్లు పూర్తిగా కాలిపోయేవని తెలిపారు. భవనానికి మొత్తం 6 మీటర్లు ఉన్నాయని శ్రీధర్ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఏంటనేది దర్యాప్తులో తేలుతుందన్నారు.


 


ముగ్గురు సజీవ దహనం 


సికింద్రాబాద్‌లోని మినిస్టర్‌ రోడ్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి అందులో ముగ్గురు గల్లంతు అయ్యారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వారి ఆచూకీ మాత్రం లోపల కనుగొనలేకపోయారు. అయితే, వీరు ముగ్గురు సజీవ దహనం అయినట్లుగా తాజాగా గుర్తించారు. వారి మృత దేహాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీరు బిహార్‌కు చెందిన ముగ్గురు కూలీలు జునైద్‌, వసీం, అక్తర్‌ అని గుర్తించారు. ఆచూకీ లభ్యంకాని కూలీల సెల్‌ఫోన్‌ లోకేషన్‌ ను ట్రేస్ చేయగా వారు మంటలు చెలరేగిన భవనంలోనే ఉన్నట్లు చూపించింది. తొలుత గల్లంతు అయిన కూలీల ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు కొనసాగించారు. కూలీల ఆచూకీ కోసం భారీ క్రేన్‌ సాయంతో బయట నుంచి భవనంలోని పై అంతస్తుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. 12 గంటల పాటు విపరీతంగా మండిన మంటల వల్ల భవనం పూర్తిగా దెబ్బతిన్నందున గాలింపు పూర్తయ్యాక భవనం మొత్తాన్ని కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు. మంటల ధాటికి ఆరు అంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది. భవనంలో 12 గంటలకు పైనే భారీ అగ్నికీలలు ఉన్నాయి. దాంతో లోపలికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అగ్నిప్రమాద సహాయ చర్యల్లో పాల్గొని అస్వస్థతకు గురైన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏడీఎఫ్‌వో ధనుంజయ రెడ్డితో పాటు ఫైరింజన్‌ డ్రైవర్‌ నర్సింగరావు గురువారం అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.


భవనం కూల్చివేతపై 


ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజినీర్ డా. ఎస్పీ ఆచూరి మాట్లాడుతూ ఎటువంటి భవన నిర్మాణానికైనా నిబంధనలు, అనుమతులు, పరిమితులు ఉంటాయని తెలిపారు.. ఈ ప్రమాదం జరిగిన భవనం అనుమతుల ప్రకారం నిర్మాణం జరిగినట్లు లేదని పేర్కొన్నారు. నిపుణుల సహాయంతో బిల్డింగ్ పరిస్థితిపై సాంకేతిక పరికరాలతో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలసిన అవసరముందని అన్నారు.. భవనం కూల్చివేత సమయంలో కూడా నిర్మాణం చేసెప్పటికంటే కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని వెల్లడించారు.