Secunderabad Protests : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో అరెస్టైన నిందితుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థుల తల్లిదండ్రులు చంచల్ గూడా జైలుకు భారీగా చేరుకుంటున్నారు. తమ పిల్లలకు ఏ పాపం తెలియదని కన్నీరు మున్నీరు అవుతున్నారు కుటుంబ సభ్యులు. రైల్వే స్టేషన్ దాడి కేసులో 46 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ములాఖత్ లో తమవారిని కలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
మా పిల్లలకు సంబంధం లేదు- తల్లిదండ్రులు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో తమ పిల్లలకు ఎలాంటి సంబంధం లేదని నిందితుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. తమ పిల్లలకు ఈ అల్లర్లతో ఎలాంటి సంబంధం లేదంటున్నారు. వారిని విడుదల చేయాలని కోరుతున్నారు. తమ పిల్లలు సికింద్రాబాద్ వెళ్తున్నట్లు తమకు తెలియదన్నారు. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చంచల్‌గూడ జైలుకు చేరుకొని ములాఖత్‌లో వారి పిల్లలను కలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ములాఖత్ కోసం ఇప్పటికే 300 మంది కుటుంబ సభ్యులు రిజిస్టర్ చేసుకున్నట్లు జైలు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 46 మందిని పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
గాంధీ ఆసుపత్రి నుంచి 6 మంది డిశ్చార్ఛ్!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసంలో గాయపడిన 6 మంది ఆర్మీ అభ్యర్థులు గాంధీ ఆసుపత్రి నుంచి ఇవాళ డిశ్చార్జ్ అవ్వనున్నారు. తొమ్మిది మంది ఆర్మీ అభ్యర్థులను డిశ్చార్జ్ చేసిన అనంతరం జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసును జీఆర్పీ పోలీసులు హైదరాబాద్ సిట్ కు అప్పగించారు. మరో ముగ్గురు ఇంకా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసును హైదరాబాద్ పోలీసులకు రైల్వే పోలీసులు బదిలీ చేశారు. అల్లర్లతో సంబంధం ఉందని భావిస్తున్న వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ గ్రూపుల్లో అడ్మిన్లు సభ్యులను రెచ్చగొట్టేలా పోస్టింగులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తరాదిలో విధ్వంసాన్ని చూసి స్ఫూర్తి పొందినట్లు పోలీసులు నిర్థరించారు. ఆందోళనకారుల వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Secunderabad Riots: సికింద్రాబాద్ ఘటనలో కామారెడ్డి యువకులు? ఇంటెలిజెన్స్ ఆరా
Also Read : Talasani In London: రైల్వేస్టేషన్ అల్లర్లలో రాకేశ్ మృతి: లండన్‌లో మంత్రి తలసాని ఏం చేశారో తెలుసా?