ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణలో జరుగుతున్న పరిణామాల పట్ల అక్కడ కూడా తనదైన శైలిలో నిరసన తెలిపారు. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్ ద్వారా చెప్పారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అగ్ని పథ్ అనే పథకానికి వ్యతిరేకంగా విపరీతంగా హింసాత్మక ఘటనలు జరిగాయనే విషయం లండన్ లో ఉన్న తనకు తెలిసిందని అన్నారు. ఆ ఆందోళనల్లో రాకేశ్ అనే యువకుడు చనిపోవడం బాధాకరమని తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బీజేపీ కేంద్రంలోని ప్రభుత్వం హింసావాదాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శించారు.


అందువల్ల, ప్రధాని మోదీకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ మంత్రి తలసాని లండన్‌లో ఉన్న గాంధీ విగ్రహం వద్దకు వెళ్లారు. ఆ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి మోదీకి మంచి బుద్ధి ప్రసాదించాలని తాను వేడుకున్నట్లుగా తెలిపారు. దీనికి సంబంధించి తలసాని శ్రీనివాస్ ట్వీట్ చేశారు.






మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గత 10 రోజుల క్రితం లండన్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా కొద్ది రోజుల క్రితం అక్కడ తెలంగాణకు చెందిన వారు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగువారందరినీ ఒకేచోట చూడటం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. వేదికపై తెలంగాణ ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను వివరించారు. ఈ సందర్భంగా బోనాల పండుగకు సంబంధించిన బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలు పూర్వీకులు మనకిచ్చిన ఆస్తి అని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఒక గొప్ప విజన్‌ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఏనిమిదేళ్లలో అనేక అద్భుతాలు సృష్టించిందని కొనియాడారు.  


అలాగే టీఆర్ఎస్ ఎన్నారై లీడర్లతో కూడా లండన్‌లో తలసాని సమావేశం అయ్యారు. అంతకుముందు ఆయనకు లండన్‌లో తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు సత్యప్రసాద్ స్వాగతం పలికారు.