Secunderabad Agnipath Protests : దేశ సైనిక బలగాల్లో రిక్రూట్మెంట్ కోసం కేంద్రం ఇటీవల అగ్నిపథ్(Agnipath) పథకాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంపై అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. పలుచోట్ల ఈ ఆందోళనలు హింసాత్మకం అయ్యాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station) లో నిరసన తెలిపారు. అయితే ఈ నిరసనల్లో ఆందోళకారులు విధ్వంసం సృష్టించారు. రైలు బోగీలకు నిప్పుపెట్టారు. స్టేషన్ లో స్టాళ్లు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు ఆందోళకారుల్లో పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న అభ్యర్థులు చంచల్ గూడ జైలులో ఉన్నారు. పలువురు అగ్నిపథ్ ఆందోళనకారులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కాంగ్రెస్ న్యాయ సలహా
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసం సృష్టించిన అగ్నిపథ్ ఆందోళనకారుల్లో 16 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) చొరవ, న్యాయసహాయంతో బెయిల్ మంజూరు అయినట్లు సమాచారం. అగ్నిపథ్ ఆందోళనలో పాల్గొన్న వారిని చంచల్ గూడ జైల్ కు వెళ్లి రేవంత్ రెడ్డి ఇంతకు ముందు కలిశారు. అగ్నిపథ్ బాధితులకు న్యాయ సహాయం చేస్తామని గాంధీభవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. వారికి ఇచ్చిన హామీ మేరకు న్యాయ సహాయం చేయడంతో పలువురు ఆందోళనకారులకు బెయిల్ మంజూరు అయింది.
16 మందికి బెయిల్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద జరిగిన అగ్నిపథ్ అల్లర్ల కేసులో 16 మంది నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన హైకోర్టు, రూ.20 వేలతో పాటు రెండు షూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. ఆర్మీ రిక్రూట్మెంట్ అభ్యర్థుల తరఫున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ కేసులో సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు 16 మందికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సైనిక బలగాల నియామకాలకు అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. దీనిపై దేశంలో అనేక రాష్ట్రాలతో పాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఆందోళనకారులు నిరసనలు చేశారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ సంఖ్యలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. దీంతో కొంతమంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. వీరిలో 16 మందికి తాజాగా బెయిల్ మంజూరు అయింది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ జూన్ 17న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు భారీ విధ్వంసం సృష్టించారు. అగ్నిపథ్ స్కీమ్ పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. జూన్ 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరుద్యోగులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయి రైళ్లను తగలబెట్టాయి. స్టేషన్ లోని స్టాళ్లను ధ్వంసం చేశారు. రైల్వే ట్రాక్ లకు అడ్డంగా పార్సిల్ వేసి అగ్గిరాజేశారు. నిరసనకారులు రైల్వే ట్రాకులపై బైఠాయించి ఆందోళన చేశారు. నిరసనకారులను అదుపుచేసేందుకు ఓ దశలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు.