BJP Second List: పార్లమెంట్ ఎన్నికలకు మరో కొద్దిరోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుందనే వార్తల క్రమంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టాయి. షెడ్యూల్ కంటే మందుగానే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ప్రకటిస్తోంది. బీజేపీ ఇటీవల తొలి జాబితాను విడుదల చేయగా.. కాంగ్రెస్ శుక్రవారం ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఈ సమయంలోనే బీజేపీ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఈ నెల 11న బీజేపీ రెండో జాబితాను విడుదల చేయనుంది. మార్చి 13న ఎన్నికల ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందన్న ప్రచారం నేపథ్యంలో మందుగానే రెండో జాబితాను కాషాయ పార్టీ ప్రకటించనుంది.


మార్చి 10న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం


మార్చి 10న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ డిల్లీలో భేటీ కానుంది. తొలి జాబితాలో ప్రకటించని మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై చర్చించనుంది.  అనంతరం రెండో జాబితాకు ఆమోదం తెలపనుంది. కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తర్వాత 11న రెండో జాబితాను విడుదల చేయనున్నారు. తొలి జాబితాలో దేశవ్యాప్తంగా 195 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీతో పాటు 34 మంది కేంద్ర మంత్రుల పేర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, బీబీ పాటిల్‌, మాధవీలతలకు తొలి జాబితాలోనే సీటు ప్రటించారు.


తెలంగాణలోని 6 స్థానాలకు ఫైనల్


తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉండగా.. వీటిల్లో 9 చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. ఇక 8 స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో బీజేపీ చర్చించనుంది. వీటిల్లో రెండు జాబితాలో తెలంగాణలోని ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ఇక మిగిలిన రెండు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను మూడో లిస్ట్‌లో ప్రకటించే అవకాశముందని కాషాయ వర్గాలు చెబుతున్నాయి.


39 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా


గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారుపై చర్చించింది. అనంతరం శుక్రవారం 39 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వయనాడ్ నుంచి బరిలోకి దిగనుండగా..  తెలంగాణ నుంచి నలుగురి పేర్లను ప్రకటించారు. జహీరాబాద్ నుంచి సురేశ్ కుమార్ షెట్కర్, నల్లగొండ నుంచి కందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, మహబూబ్‌నగర్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి పేర్లను ప్రకటించింది. ఇక రెండో జాబితాపై కూడా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే రెండో జాబితాను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు టీడీపీతో పాటు పలు పార్టీలను ఎన్డీయేలో చేర్చుకోవడంపై బీజేపీ కసరత్తు చేస్తోంది. వాటిపై క్లారిటీ వచ్చాక మూడో జాబితాపై దృష్టి పెట్టనుంది.