School Holidays: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. రానున్న 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు, వరదల పరిస్థితిని అంచనా వేసి జిల్లాల పరిధిలో స్కూళ్లకు సెలవు ప్రకటించే విషయంలో కలెక్టర్లదే తుది నిర్ణయమని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. సీఎస్ ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సోమవారం స్కూళ్లకు సెలవు దినంగా నిర్ణయించారు. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణతో పాటు ఏపీకి ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
సోమవారం సెలవు
హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. రానున్న రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని పది జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
హైదరాబాదీ జాగ్రత్త సుమా !
హైదరాబాద్‌ను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పింక్ అలర్ట్ జారీ చేశారు. అవసరమైతే కూడా బయటకు వెళ్లవద్దని ఐఎండీ హైదరాబాద్ వాసులకు సూచించింది. భారీ వర్ష సూచనతో నగరం అప్రమత్తమైంది. మూసీ పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వరద ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. కాగా, అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. మరికొన్ని గంటల్లో ఇది తీరం దాటనుంది. దీని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి పూట కూడా చీకటిగా ఉండడంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. వర్షాల సమయంలో అధికారులు కూడా ప్రజలను బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
సెప్టెంబర్ 3వరకు వానలే వానలు
ఐఎండీ ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 3 వరకూ భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. సెప్టెంబర్ 1న కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండతో సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, నాగర్‌కర్నూల్ సహా జిల్లాల్లో సెప్టెంబరు 1న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. సెప్టెంబర్ 2న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌లలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సెప్టెంబరు 3న తెలంగాణ వ్యాప్తంగా గాలితో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.