Rains in Guntur: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. అది తీవ్ర వాయుగుండంగా మారి ఏపీ వైపునకు తుపాను రూపంలో వస్తోంది. నేటి రాత్రి తీరం దాటనుంది. దాని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొండచరియలు విరిగిపడి ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఉత్తరాంధ్రతోపాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మేఘానికి చిల్లు పడిందా అన్నంతలా కుండపోత వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.
మెుగల్రాజపురంలో కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదాన్నిమిగిల్చింది. ఇళ్లపై కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతి చెందారు. ఈ విషాధకర ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలోని వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒక టీచర్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ విషాద ఘటన పెదకాకాని మండలానికి చెందిన ఉప్పలపాడు గ్రామంలో చోటుచేసుకుంది. పాఠశాలకు సెలవు ప్రకటించడంతో ఇద్దరు పిల్లలను టీచర్ తీసుకుని వస్తుండగా ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
వరద ఉధృతికి కొట్టుకుపోయిన కారు..
నంబూరు పాఠశాలలో రాఘవేంద్ర అనే వ్యక్తి టీచర్ గా పనిచేస్తున్నారు. పాఠశాలకు సెలవు ప్రకటించడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటికి బయలుదేరారు. రోడ్డుపై డ్రెయిన్ నీరు ప్రవహిస్తున్నా ఆగకుండా రాఘవేంద్ర కారును వాగుగుండా వెళ్లనిచ్చారు. అయితే మురుగునీటి ఉద్ధృతికి కారు కొట్టుకుని పోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. కారులోని అద్దాలను పగలగొట్టి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి వివరాలను పోలీసులు ప్రకటించారు. నడుంపల్లి రాఘవేంద్ర(38) మ్యాథ్స్ టీచర్‌గా పని చేస్తున్నారు. పసుపులేటి సౌదీస్(8) వైవా స్కూల్‌లో సెకండ్ క్లాస్ చదువుతున్నారు. కోడూరి మాన్విత్(9) వైవా స్కూల్‌లో థర్డ్ క్లాస్ చదువుతున్నట్లు తెలిపారు.
అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షం కారణంగా విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా వన్ టౌన్ ఏరియాలో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. చాలా ప్రాంతాల్లో మోకాలు లోతు నీళ్లు నిలిచాయి. ఇబ్రహీంపట్నం ఊర్లో వరద నీరు చేరింది. భారీ వర్షాలతో ఇబ్రహీం పట్నం బస్టాండ్‌లో బస్సులు నీటిలో మునిగి ఉన్నాయి. విజయవాడ నగరం జలదిగ్బంధమైంది. విజయవాడలో కనుగక ఇంకాస్సేపు వర్షం పడితే మనిషి మునిగే లోతు నీళ్లు రావటం ఖాయంగా కన్పిస్తోంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసేశారు. ఇదిలా ఉంటే ఘాట్ రోడ్డు దిగువన మూడు భారీ వృక్షాలు కూలిపోయాయి.
వాగులో బైక్ తో సహా కొట్టుకుపోయిన యువకుడు
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండల పరిధిలోని ముప్పాళ్ల గ్రామంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఓ యువకుడు బైక్‌పై వాగు దాటే ప్రయత్నం చేశాడు. వాగు మధ్యలోకి వెళ్లగానే వరద ఉధృతికి వాగులో బైక్ తో సహా కొట్టుకుపోయాడు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు సహాయ చర్యలు చేపట్టి అతని మీ ఒడ్డుకు తీసుకొచ్చారు. దీంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు.