Adilabad District Collector: ఆదిలాబాద్ జిల్లాలో యువత, ప్రజలు మత్తు పదార్థాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహూల్ రాజ్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో మత్తు పదార్థాలైన గంజాయి పండించకుండా, వాడకుండా, డ్రగ్స్ వినియోగించకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలైన గంజాయి పండించిన వారిపై కేసులు నమోదు చేస్తూ, ప్రభుత్వ పథకాలైన రైతుబంధు లాంటివి రాకుండా చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కళాశాలలో, పాఠశాలల్లో ప్రత్యేకంగా అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి చైతన్యాన్ని కలిగించాలని తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు, రైతులు, దళారుల మాటలు నమ్మి మోసపోయి గంజాయి పండించినట్లయితే వచ్చే అనర్థాలపై అవగాహనా కల్పిస్తామన్నారు. జిల్లా పోలీసు శాఖ, వ్యవసాయ శాఖ సమన్వయంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇదివరకే మత్తు పదార్థాలకు బానిసైన యువత, ప్రజలు ఎవరైనా ఉంటే వారికి.. డి అడిక్షన్ సెంటర్ ద్వారా నయం చేసే అవకాశం ఉన్నందున వాటిని వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గంజాయి స్మగ్లర్ల పై త్వరలోనే పీడి యాక్ట్ కేసులు నమోదు చేయబోతున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గంజాయి విక్రయదారులను, పండించే వారిని నియంత్రిస్తున్నట్లు తెలియజేశారు. గంజాయి అలవాటుపడ్డ వ్యక్తుల తల్లిదండ్రులకు సైతం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో గంజాయి రహిత సమాజాన్ని సాధించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పోస్టర్లను జిల్లా ఉన్నతాధికారులకు సమక్షంలో ఆవిష్కరించారు.
గత ఆరు నెలలలో జిల్లా వ్యాప్తంగా గంజాయి పండిస్తున్న 38 వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, వీరిపై 20 కేసులను నమోదు చేస్తూ 133 కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకోగ, 275 గంజాయి మొక్కలను సైతం స్వాధీనం చేసుకొని ధ్వంసం చేసినట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.