Rahul Gandhi : తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రజల ప్రేమ, అభిమానం ఉన్నంత కాలం భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదన్నారు. దేశంలో బీజేపీ, ఆరెస్సెస్, హింసను ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు. సామాన్యుల్లో భయాందోళన సృష్టిస్తున్నాయన్నారు. ఉద్దేశ పూర్వకంగానే బీజేపీ దేశంలో నిరుద్యోగం పెరిగేలా చేస్తోందన్నారు. నోట్ల రద్దుతో ఎవరికి లాభం జరిగిందని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో నిరుద్యోగం పెరిగిందని విమర్శించారు. మోదీ తప్పుడు నిర్ణయాలతోనే దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. దేశంలో, రాష్ట్రంలో ధనం కొద్ది మంది చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. బీజేపీ, టీఆరెస్ వేరు కాదు.. ఇద్దరూ కలిసే ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని చంపేయడమే బీజేపీ, టీఆరెస్ విధానం అన్నారు. అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ విద్య, వైద్యాన్ని ప్రైవేటీకరిస్తున్నారని ఆరోపించారు.
దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమే జోడో యాత్ర లక్ష్యం
"దశాబ్దాలు శ్రమించి ఏర్పాటు చేసిన ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరిస్తున్నారు. వేల కోట్ల విలువైన భూముల కోసమే ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరిస్తున్నారు. ప్రాజెక్టులు, ధరణి పోర్టల్ తో సీఎం కేసీఆర్ కమీషన్లు దండుకుంటున్నారు. రైతు వ్యతిరేక చట్టానికి పార్లమెంటులో బీజేపీకి టీఆరెస్ సహకరించింది. బీజేపీ, టీఆరెస్ కలిసి పనిచేస్తున్నాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జోడో యాత్ర చేపట్టాం. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమే యాత్ర లక్ష్యం. భారత భూభాగంలోకి చైనా రాలేదంటే మరి కల్నల్ సంతోష్ బాబు ఎలా మరణించారు. చైనాతో పోరాడిన కల్నల్ సంతోష్ బాబును మోదీ అవమానించారు. ఇది కల్నల్ సంతోష్ బాబు అమరత్వాన్ని కించపరచడమే. కల్నల్ అమరత్వాన్ని గుర్తు చేస్తూ ఈ వేదిక నుంచి మోదీని ప్రశ్నిస్తున్నా. చైనా మన దేశ భూభాగాన్ని ఆక్రమిస్తుంటే మోదీ ఏం చేస్తున్నారు?"- రాహుల్ గాంధీ
25 కి.మీ పాదయాత్ర
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. సంగారెడ్డి నియోజకవర్గంలోకి రాహుల్ గాంధీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సహా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇవాళ 25 కిలో మీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. చేర్యాల, కంది, పోతిరెడ్డి పల్లి చౌరస్తా, సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి ఫసల్వాదీ మీదుగా శివంపేట వరకు రాహుల్ పాదయాత్ర కొనసాగింది. ఉత్తర తెలంగాణ గిరిజన సంస్కృతిలో భాగమైన సాంప్రదాయక థింసా నృత్యంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. గిరిజనులతో పాటు రాహుల్ గాంధీ కూడా థింసా నృత్యం చేశారు. అంతేకాక, పోతురాజులను కూడా రాహుల్ కలిశారు. వారి వద్ద ఉన్న కొరడా తీసుకొని సరదాగా తనను తాను రాహుల్ గాంధీ కొట్టుకున్నారు.