CM Jagan Review : నాణ్యమైన విద్యకోసం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువస్తున్నామని సీఎం జగన్ అన్నారు. విద్యా శాఖ పై సీఎం జగన్ గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. బడులు ప్రారంభమ్యయే తొలి రోజునే విద్యాకానుక కిట్‌ ఇస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా స్కూల్‌ బ్యాగు, బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్, యూనిఫాం, షూ, సాక్సులు, బెల్టు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ఇస్తున్నామని చెప్పారు. వీటన్నింటినీ ఒకేసారి పిల్లలకు స్కూల్‌ ప్రారంభించే తొలిరోజే అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. స్కూల్‌ పిల్లలకు సెప్టెంబరు, అక్టోబరు వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వని పరిస్థితి ఉండేదని సీఎం గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ విధానంలో మార్పు తెచ్చామని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలు, వారి తల్లిదండ్రుల్లో నైతిక స్థైర్యం దెబ్బతినేలా వ్యతిరేక మీడియా రాతలు ఉన్నాయని జగన్ మండిపడ్డారు.


ఇంగ్లీషు మీడియంపై ఎందుకు వ్యతిరేకత 


పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందడం కొందరికి ఇష్టం లేదని సీఎం జగన్ అన్నారు. అందుకే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాకీయంగా జగన్‌ను ఇబ్బందిపెట్టాలి కాబట్టి, ఇలాంటి కథనాలు రాస్తున్నారని, రాజకీయంగా జరుగుతున్న ఈ యుద్ధంలో.. దురదృష్టవశాత్తూ  సామాన్యులు, తల్లిదండ్రులు, బడిపిల్లలు ఇబ్బంది పడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం రాగానే పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకువచ్చామని, పుస్తకాల్లో జోడించిన అదనపు సమాచారంతో బైలింగువల్‌ కాన్సెప్ట్‌ వల్ల టెక్ట్స్‌బుక్‌ సైజు పెరిగిందని, బైలింగువల్‌ టెక్ట్‌బుక్స్‌లో ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీషు ఉంటుందన్నారు.  దీంతో సాధారణంగానే టెక్ట్స్‌బుక్‌ సైజు పెరుగుతుందన్నారు. దీన్ని కూడా వక్రీకరించి, పిల్లలు, తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించేలా తప్పుడు ప్రచారం చేయటం పై జగన్ అభ్యంతరం తెలిపారు.


పటిష్టంగా సబ్జెక్ట్‌ టీచర్ల కాన్సెప్ట్‌ 


గతంలో క్లాస్‌ టీచర్‌కే అవకాశం లేని పరిస్థితుల నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నట్లు సీఎం వివరించారు. అంతకు ముందు పాఠ్యాంశాలు అదే సబ్జెక్టులో నిపుణుడైన టీచర్‌ బోధించే పరిస్థితి లేదని గుర్తు చేశారు. అందుకే సబ్జెక్టు టీచర్‌ కాన్సెప్ట్‌ పేరుతో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. మూడోతరగతి నుంచి 10వ తరగతి వరకూ సబ్జెక్ట్‌ టీచర్స్‌ కాన్సెప్ట్‌ సమర్థవంతగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. నిరంతరం పర్యవేక్షిస్తూ పిల్లలకు సబ్జెక్టుల వారీగా అత్యుత్తమ బోధన అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు.


 డిజిటలైజేషన్‌ ఆఫ్‌ క్లాస్‌ రూమ్స్‌ 


డిజిటలైజేషన్‌ ప్రక్రియలో స్కూల్లో ఉన్న  ప్రతి క్లాస్‌రూం డిజిటలైజ్ కావాలని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పేద పిల్లలకు మంచి భవిష్యత్‌ అందించాలన్నదే మన లక్ష్యమని వివరించారు. అప్పుడే వారి జీవితాల్లో మార్పు వస్తుందన్నారు. పేదరికం నుంచి బయటపడి, కేవలం విద్య ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. అందుకే విద్యారంగంలో చేపడుతున్న ఈ మార్పులు విషయంలో రాజీ పడొద్దని సూచించారు. విద్యారంగంలో పెడుతున్న ఖర్చు  మానవవనరుల మీద పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి కింద భావించాలని, ఈ విషయంలో ఎలాంటి వెనుకడుగు వేయాల్సిన పనిలేదన్నారు. అంతే కాదు గోరుముద్ద అమలు ప్రక్రియ కూడా పక్కాగా ఉండాలని సీఎం అన్నారు. ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌ నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.