Helicopter Services in Medaram Jathara: ఆదివాసీల జాతర మేడారం మహా కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అధిక సంఖ్యలో భక్తులు మేడారానికి చేరుకుని సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకూ వన దేవతల జాతర జరగనున్న నేపథ్యంలో.. అమ్మల దర్శనం మరింత సులభతరం చేసేలా, జాతర అద్భుత దృశ్యాన్ని చూసేలా హెలికాఫ్టర్ సేవలు ఈసారి కూడా అందుబాటులోకి రానున్నాయి. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా, భక్తులు ఓ ప్రత్యేక అనుభూతి పొందేలా రాష్ట్ర పర్యాటక శాఖ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. భక్తులు గగన విహారం చేస్తూ వనదేవతలను దర్శించుకునే భాగ్యాన్ని కల్పించింది.


టికెట్ ధరలివే


హైదరాబాద్, హనుమకొండ పర్యాటక శాఖల ఆధ్వర్యంలో మేడారం వరకూ హెలికాఫ్టర్ సర్వీసులను నడపనున్నారు. మేడారం పరిసర అందాలను వీక్షించేందుకు భక్తుల కోసం ప్రత్యేకంగా మేడారంలో హెలికాఫ్టర్ జాయ్ రైడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో సేవలందించిన ప్రైవేట్ సంస్థతోనే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని ఈ సేవలను అందుబాటులోకి తెస్తోంది. మేడారంలో జాయ్ రైడ్ కోసం రూ.4,800గా టికెట్ ధర నిర్ణయించారు. వరంగల్ నుంచి మేడారానికి వెళ్లి తిరుగు ప్రయాణానికి రూ.28,999గా అధికారులు నిర్ణయించారు. ఒక్కో ట్రిప్ లో ఐదుగురికి ప్రయాణించే అవకాశం ఉంది. కాగా, ఈసారి హెలికాఫ్టర్ సేవలను హనుమకొండ నుంచి మాత్రమే కాకుండా హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ వంటి ప్రాంతాల నుంచి కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ టికెట్ ధర నిర్ణయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. హెలికాఫ్టర్ సేవలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని.. హెలికాఫ్టర్ సేవలు కూడా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.


18 నుంచి ప్రత్యేక బస్సులు


మేడారం మహా జాతరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా టెంపరరీ ఆపరేటింగ్ పాయింట్ల పనులు ముమ్మరం చేశారు. ఈసారి మేడారం జాతరకు కోటికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 


ఇంటి వద్దకే అమ్మవారి ప్రసాదం


జాతరకు వెళ్లలేకపోయిన భక్తులకు కూడా సమ్మక్క - సారలమ్మ ప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేసింది టీఎస్‌ఆర్టీసీ (TSRTC). ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే చాలు.. మేడారం జాతర ప్రసాదాన్ని మీ ఇంటికే అందించేలా  దేవాదాయ శాఖతో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగం ఇటీవల ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తుల ఇళ్ల దగ్గరకే అందజేయనుంది టీఎస్‌ఆర్టీసీ. 


బుకింగ్ ఇలా


భక్తులు ఆన్‌లైన్‌లో గానీ..  ఆఫ్‌లైన్‌లో గాని.. ప్రసాదాన్ని బుక్‌చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో అయితే... టీఎస్ఆర్టీసీ కార్గో కౌంటర్లలో గానీ... పీసీసీ ఏజెంట్ల దగ్గర గానీ.. రూ.299 చెల్లించి మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చు. ఈ నెల 25 వరకూ ప్రసాదం బుకింగ్ సేవలు కొనసాగనున్నాయి. ఆన్‌లైన్‌ అయితే... https://rb.gy/q5rj68 లింక్‌పై  క్లిక్‌ చేయాలి. లాదే... పేటీఎం ఇన్‌ సైడర్‌ యాప్‌లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని బుక్‌ చేసుకోవచ్చు. ప్రసాదం బుకింగ్‌ సదుపాయం తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మేడారం జాతర అయిపోయిన తర్వాత... బుక్‌ చేసుకున్న వారి  ఇంటికే ప్రసాదాన్ని అందజేస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్స్ (కార్గో) కౌంటర్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. పీసీసీ ఏజెంట్స్‌తో పాటు డిపోల పరిధిలో విధులు నిర్వర్తించే మార్కెటింగ్  ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించి ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వవచ్చని చెప్పారు. ఆన్‌లైన్‌లో ప్రసాదం బుక్‌ చేసుకునే భక్తులు... వారి అడ్రెస్‌, పిన్‌ కోడ్‌, ఫోన్‌ నంబర్‌ను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. మేడారం ప్రసాద బుకింగ్‌కు సంబంధించిన పూర్తి  వివరాల కోసం కాల్‌ సెంటర్‌ నెంబర్లు 040-69440069, 040-69440000, 040-23450033 సంప్రదించాలని సజ్జనార్‌ సూచించారు.


Also Read: Telangana High Court: 'టైం పాస్ కోసం పోలీస్ స్టేషన్‌కు వస్తారా?' - పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు