Williamson has scored seven centuries in his past 12 Test innings: భీకర ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌(Kane Williamson) మరో శతకంతో చెలరేగాడు. దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. విల్ యంగ్‌తో కలిసి 152 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కేన్‌ మామ.. 133 పరుగులతో అజేయంగా నిలవడంతో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో న్యూజిలాండ్‌ 7 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న కేన్‌ విలియమ్సన్‌ 260 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్సతో 133 పరుగులతో అజేయంగా నిలిచి న్యూజిలాండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ సెంచరీలు చేసిన విలియమ్సన్‌...  రెండో టెస్ట్‌లోనూ సెంచరీ చేసి సత్తా చాటాడు. 

 

ప్రొటీస్‌పై తొలి సిరీస్‌ విజయం

దక్షిణాఫ్రికాపై కివీస్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్‌ విజయం కావడం విశేషం. 267 ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 40/1తో నాలుగో రోజు, శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన కివీస్‌.. లేథమ్‌ (30) వికెట్‌ను త్వరగా కోల్పోయింది. ఈ స్థితిలో విలియమ్సన్‌ స్థిరంగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. మొదట రచిన్‌ రవీంద్ర (20)తో ఇన్నింగ్స్‌ నిలబెట్టిన అతడు.. ఆ తర్వాత విల్‌ యంగ్‌ (60 నాటౌట్‌) జతగా జట్టును విజయతీరాలకు చేర్చాడు. యంగ్‌తో అబేధ్యమైన నాలుగో వికెట్‌కు కేన్‌ 152 పరుగులు జోడించాడు  గత 12 ఇన్నింగ్స్‌ల్లో అతడికిది ఏడో సెంచరీ కావడం విశేషం.

టెస్టుల్లో నెంబర్‌ వన్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్న విలియమ్సన్.. ఈ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు చేశాడు. 134 సగటుతో మొత్తం 403 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ సిరీస్‌లో కేన్‌ మామ 19 గంటలపాటు బ్యాటింగ్‌ చేశాడు. 

 

కేన్‌ మామ కొత్త రికార్డు

ఇప్పటికే భారత స్టార్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli), క్రికెట్‌ లెజెండ్‌, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డాన్‌ బ్రాడ్‌మన్‌ పేరిట ఉన్న 29 సెంచరీల రికార్డును,  అధిగమించిన కేన్‌ మామ..  ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) 30 సెంచరీల రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ఇప్పుడు మరో శతకంతో ఆస్ట్రేలియా ర‌న్ మెషిన్ స్టీవ్ స్మిత్‌ స‌ర‌స‌న నిలిచాడు. ప్రస్తుతం స్మిత్, విలియమ్సన్‌ 32 శ‌త‌కాల‌తో టాప్‌లో కొన‌సాగుతున్నాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు మూడంకెల స్కోర్ సాధించిన రెండో ఆట‌గాడిగా కేన్‌ నిలిచాడు. 32 సెంచ‌రీతో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న‌ ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ స్టీవ్ స్మిత్() రికార్డును స‌మం చేశాడు. అంతేకాదు స్మిత్ కంటే త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఈ కివీస్ బ్యాట‌ర్ 32 సెంచ‌రీల మైలురాయికి చేరుకున్నాడు. విలియ‌మ్సన్ 172 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించ‌గా.. స్మిత్ 174 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. టెస్టుల్లో వేగంగా 32 సెంచరీలు సాధించిన జాబితాలో విలియమ్సన్, స్టీవ్ స్మిత్, రికీ పాంటింగ్ (176 ఇన్నింగ్స్), సచిన్ టెండూల్కర్ (179 ఇన్నింగ్స్), యునిస్ ఖాన్ (183 ఇన్నింగ్స్) ఉన్నారు. ఈ క్రమంలో విలియమ్సన్ మరిన్ని రికార్డులు బద్దలుకొట్టాడు. టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు.