Salman Khan meeting with Revanth Reddy: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్.. సీఎం రేవంత్ రెడ్డిని ముంబైలో కలిశారని సీఎం సోదరుడు కొండల్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేయడంలో సల్మాన్ సాయం చేస్తారని చెప్పారు.
కొండల్ రెడ్డి చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ముంబైకి ఎప్పుడు వెళ్లారో ఎవరికీ తెలియదు. గురువారం ఆయన పొద్దుపోయే వరకూ సమీక్షల్లో గడిపారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. మరి ముంబై ఎప్పుడు వెళ్లారు.. ఎప్పుడు వచ్చారన్నది మాత్రం ఎవరికీ తెలియదు. గురువారం మాత్రం ఆయన ముంబై పోలేదని.. అంతకు ముందు ఎప్పుడైనా వెళ్లినప్పుడు కలిసి ఉంటారని ఇప్పుడు ఆ ఫోటోను బయట పెట్టారని కొంత మంది చెబుతున్నారు.
అయితే ఇప్పుడు ఆ ఫోటోను ఎందుకు బయట పెట్టాల్సి వచ్చిందన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది. దీనికి కారణం జూబ్లిహిల్స్ ఉపఎన్నికలేనని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మైనార్టీ ఓట్ల కోసం సల్మాన్ ఖాన్ తో ఫోటో దిగి ముఖ్యమంత్రి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
అయితే రేవంత్ రెడ్డి .. సల్మాన్ ఖాన్ తో ఫోటో దిగడం వల్ల పాతబస్తీలోని ముస్లిలు కాంగ్రెస్ కు ఓటేస్తారా అంటే.. అదో ప్రయత్నం మాత్రమేనని అంటున్నారు. జూబ్లిహిల్స్ లో లక్షకుపైగా ఓట్లు మైనార్టీలవి ఉన్నాయి. వారు ఖచ్చితంగా ఓటు వేసే కేటగిరీలో ఉంటారు. మిగిలిన వర్గాల్లో కొంత వరకూ ఓట్లు వేయడానికి ఆసక్తి చూపించరు .. అందు వల్ల ఓటింగ్ ఎక్కువగా చేసే..మైనార్టీ వర్గాల్లో ఆదరణ కోసం రేవంత్ .. సల్మాన్ ఖాన్ ను కలిశారని చెబుతున్నారు.
ఇప్పటికే మైనార్టీ వర్గాలను ఆకట్టుకునేందుకు మహమ్మద్ అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారు. అప్పటికప్పుడు ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే. ఏ చిన్న అవకాశాన్నీ రేవంత్ వదులుకోవాలని అనుకోవడం లేదని చెబుతున్నారు.