Rythu Bandhu Scheme In Telangana: తెలంగాణలో అర్హులైన రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు సోమవారం నుంచి జమచేయనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. జూన్ 26వ తేదీ నుంచి రైతుబంధు నగదును అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.


రైతులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం రైతు బంధు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడం, ఆపై వర్షాలు మొదలుకావడంతో అన్నదాతలకు పంట సాయం రెండు దఫాలలో అందిస్తారు. వానాకాలం ఖరీఫ్ సీజన్ కుగానూ సోమవారం (జూన్‌ 26) నుంచి రైతుల ఖాతాల్లో నుంచి రైతుబంధు జమ చేయనుంది ప్రభుత్వం. పదకొండో విడతకు సంబంధించి 70లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 


ఈ సారి 1.5లక్షల మంది పోడు రైతులకు సైతం రైతుబంధు అందించాలని కేసీఆర్ నిర్ణయించారు. 1.54కోట్ల ఎకరాలకుగానూ అర్హులైన రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7720.29కోట్లు జమకానున్నాయి. ఈ ఏడాది కొత్తగా 5 లక్షల లబ్దిదారులు రైతు బంధు సాయం అందుకోనున్నారు. సుమారు 4 లక్షల పోడు భూములకు రైతు బంధు లభించనుంది. 


గతం కన్నా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.300 కోట్ల అదనపు భారం పడనుంది. 10 వ విడత వరకు రూ.65,190 కోట్లు జమ చేశారు. ఎప్పటి మాదిరిగానే ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నాయి. మొదట ఎకరం భూమి లోపు ఉన్న వారికి, ఆ తరువాత 2 ఎకరాలు, 5 ఎకరాలు అలా 11వ విడత పూర్తయ్యేసరికి అర్హులైన రైతలన్నలకు పంట నగదు సాయం అందుతుందని మంత్రి తెలిపారు. రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయాలని, ఇందుకోసం అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావును, అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.  
Also Read: KCR News: మహారాష్ట్రలో 2 రోజుల పర్యటనకు కేసీఆర్, పూర్తి షెడ్యూల్ ఇదీ


పోడు భూములకు పట్టాలు- ఈ 30న కేసీఆర్ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభం 
జూన్ 30వ తేదీ నుంచి ఆదివాసీ గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి అదే రోజు (జూన్ 30)న సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. 


రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో అదే రోజు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు. పోడు పట్టాల పంపిణీ చేశాక.. వీరికి కూడా రైతుబంధు అందించనున్నారు. ఈ నెల 24 నుంచే పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రకటించినప్పటికీ.. కొన్ని అనివార్య కారణాలతో ఈ నెల 30 తేదీన పట్టాలు ఇవ్వాలని రీ షెడ్యూల్ చేశారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial