Rythu Bandhu amount: హైదరాబాద్: తెలంగాణలో రైతుబంధు కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు (Farmers in Telangana) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. యాసంగి సీజన్‌లో రైతు బంధు సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం (శుక్రవారం) నవంబరు 24న అనుమతి ఇవ్వడం తెలిసిందే. నవంబరు 28లోగా రైతు బంధు ప్రక్రియ ముగించాలని స్పష్టం చేసింది. అయితే నవంబర్ 25, 26, 27 వరుస సెలవుదినాలు కావడంతో నవంబరు 28న రైతు బంధు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం (Telangana Government) నిర్ణయించింది. అన్నదాతల ఖాతాల్లో రూ.5 వేలు యాసంగి సీజన్ రైతు బంధు పెట్టుబడి సాయం మంగళవారం (నవంబర్ 28న) ఒక్కరోజే జమ చేయనున్నారని వ్యవసాయశాఖ కమిషనర్ తెలిపారు. అయితే ఈసీ ఆదేశాల మేరకు ఆరోజు సాయంత్రం 5 గంటల లోపే అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం (Rythu Bandhu Money) జమ చేయాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో అర్హులైన 70 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో యాసంగి సీజన్ కోసం ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుబంధు సాయం జమ చేయాలి. మొత్తం రూ.7,700 కోట్లను ఆర్థికశాఖ ఒకేరోజు రైతుల ఖాతాల్లో వారి భూమి ఎకరానికి అయిదు వేల చొప్పున జమ చేస్తామని వ్యవసాయశాక కమిషనర్ తెలిపారు. నవంబర్ 28న ఉదయం నుంచి కొన్ని గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసేలా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఎన్నికల ప్రచార గడువు ముగిసే నవంబరు 28న సాయంత్రంలోపే పూర్తి చేయాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి అనుగుణంగా శుక్రవారం రాత్రి భూపరిపాలన ప్రధాన కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యాలయాలు ఈ-కుబేర్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలో అర్హులైన 70 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. శని, ఆది, సోమవారాలు సెలవు దినాలు కావడంతో ట్రెజరీలతో పాటు బ్యాంకులు పనిచేయడం లేదు. నవంబరు 28న మంగళవారం పనిదినం కావడంతో ఎట్టకేలకు ఆ ఒక్కరోజులో రైతు బంధు సాయాన్ని అన్నదాతలకు అందించాలని ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది.
Also Read: Telangana Elections 2023 : రైతు బంధు నగదు జమ డౌటేనా ? - ఊహించని సమస్య !
కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఆపాలని ఫిర్యాదు చేసిందంటూ కొన్ని రోజుల కిందటి వరకు బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర మంత్రులు ఆరోపించారు. మొదట ఎలక్షన్ కోడ్ కారణంగా ఈసీ సైతం అనుమతి ఇవ్వాలా వద్దా అని యోచించింది. అయితే గతంలోనూ ఇచ్చిన అనుమతి, నిబంధనల్ని పరిశీలించి రైతు బంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆటంకాలు తొలగిపోయాయి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
2018 అక్టోబర్ 5న కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులు పూర్తిచేయాలని నిర్దేశించింది. రైతులకు ఏడాదికి రూ.10 వేలు పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుండగా, ఖరీఫ్ సీజన్ రూ.5 వేలు పెట్టుబడి సాయం ఇదివరకే రైతుల ఖాతాల్లో జమ చేశారు. తాజాగా యాసంగి సీజన్ సాయన్ని రూ.5 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో మంగళవారం జమ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని వ్యవసాయశాఖ కమిషనర్ తెలిపారు.