రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం అక్కడున్న వారినే కాకుండా విదేశీయులను సైతం ఆందోళనకు గురి చేస్తుంది. వస్తువుల ధరలు పెరుగుతాయనే అంశంపై భయం సంగతి అటుంచితే, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విదేశీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వారి తల్లిదండ్రులు తమ పిల్లల పరిస్థితిపై బిక్కుబిక్కుమంటున్నారు. ఉక్రెయిన్‌లో దాదాపు 20 వేల మంది భారతీయులు ఉన్నారని కేంద్రం తేల్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 4 వేల మంది వరకు భారత్‌కు తిరిగి వచ్చినట్టు ప్రకటించింది. ఇక, తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా వందల సంఖ్యలో ఉక్రెయిన్‌లో ఉన్నారు. అయితే, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కూడా వారి విషయంలో అప్రమత్తం అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులకు తగిన సాయం అందించేందుకు ఢిల్లీతోపాటు తెలంగాణ సెక్రెటేరియట్‌లలో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్ వెల్లడించారు.


ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రత కోసం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు వివరాలను సీఎస్‌ సోమేష్ కుమార్ ప్రకటించారు.


ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో
* విక్రమ్ సింఘ్ మాన్: +91 7042566955
* చక్రవర్తి పీఆర్‌వో: +91 9949351270
* నితిన్ ఓఎస్డీ: +91 9654663661
* ఈ-మెయిల్ ఐడీ: rctelangana@gmail.com


తెలంగాణ సచివాలయం
* చిట్టిబాబు ఏఎస్‌వో: 040-23220603, +91 9440854433
* ఈ-మెయిల్ ఐడీ : so_nri@telanagan.gov.in


ఏపీ ప్రభుత్వం కూడా హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అధికారులను అప్రమత్తం చేశారు. ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులతో మంత్రి ఆదిమూలపు సురేష్ ఫోన్‌లో మాట్లాడారు.ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు అందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. విద్యార్థులను ఏపీకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఉక్రెయిన్‌లో జఫ్రూషా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు వైద్య విద్య అభ్యసిస్తున్నారని మంత్రి తెలిపారు. విద్యార్థులు నిషేధిత ప్రాంతాలకు వెళ్లకూడదని.. ఇండియన్ ఎంబసీ ఇచ్చే సూచనలను పాటించాలని చెప్పారు.


ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు సైతం ఉక్రెయిన్‌లో ఉన్నారని.. వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని కోరారు. ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీని ఏపీ విద్యార్థులు సంప్రదించాలని జగన్‌ సూచించారు.


ఏపీ హెల్ప్ లైన్ నెంబర్లు
* ఎంవీఎస్‌ రామారావు, ఏపీ భవన్‌ అసిస్టెంట్‌ కమిషనర్: 9871990081
* ఏఎస్‌ఆర్‌ఎన్‌ సాయిబాబు, ఏపీ భవన్ ఓఎస్డీ: 9871999430
* పి.రవిశంకర్‌, నోడల్‌ అధికారి: 9871999055
* లోకల్ హెల్ప్ లైన్ నంబర్: 0863-2340678 
* వాట్సాప్ నంబర్: +91 8500027678