Rs1000 Crore Sheep Scam Across Telangana: తెలంగాణ అంతటా రూ.1000 కోట్ల గొర్రెల కుంభకోణం జరిగిందని ఈడీ సంచలనాత్మకప్రకటన చేసింది.  CAG ఆడిట్‌లో కేవలం 7 జిల్లాల్లోనే 253.93 కోట్ల నష్టం జరిగినట్లు తేలింది.  33 జిల్లాల్లోనూ  రూ.   1000 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ED అధికారిక ప్రకటన జారీ చేసింది.  అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ దరఖాస్తుతో ముడిపడి ఉన్న 200 కి పైగా అనుమానిత డమ్మీ, మ్యూల్ ఖాతాలను ఈడీ గుర్తించింది.         

బెట్టింగ్ స్కాంతో గొర్రెల స్కాంకు లింక్                

మాజీ పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ OSD కల్యాణ్ కుమార్ పై రెండు రోజుల కిందట ED దాడులు జరిగాయి. SRDS కింద గొర్రెలను సరఫరా చేసినందుకు చెల్లింపుగా అనేక వ్యక్తులు, సంస్థలకు నిధులు బదిలీ చేశారు. కానీ  ఈ పథకం  లబ్ధిదారులు గొర్రెల అమ్మకం , సరఫరాలో పాల్గొనలేదని దర్యాప్తులో తేలింది. లబ్దిదారులుగా చెప్పిన  వారు అసలు గొర్రెల  అమ్మకం లేదా కొనుగోలు చేయలేదు. గొర్రెలను ఇచ్చినట్లుగా చూపించి ఆ డబ్బులను  నకిలీ విక్రేతల బ్యాంకు ఖాతాలకు చట్టవిరుద్ధంగా మళ్లించారు.           

భారీగా సిమ్ కార్డులు స్వాధీనం,  లావాదేవీలు గుర్తింపు             

కల్పిత విక్రేతలకు చెల్లింపులు చేసారు.  ప్రభుత్వ చెల్లింపులను తప్పుగా క్లెయిమ్ చేయడానికి గొర్రెల యూనిట్లను రీసైకిల్ చేశారు.ప్రభుత్వ అధికారులు , ఇతరులకు లంచాలు ఇచ్చినట్లుగా చూపించే నేరారోపణ పత్రాలను ED స్వాధీనం చేసుకుంది.  ఖాళీ చెక్ పుస్తకాలు, పాస్‌బుక్‌లు ,  డెబిట్ కార్డులు సహా అనేక బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.  చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించిన  31 ఉపయోగించిన మొబైల్ ఫోన్‌లు,  20 కి పైగా సిమ్ కార్డులను ED స్వాధీనం చేసుకుంది.  జూలై 30, 2025న, గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం (SRDS)తో ముడిపడి ఉన్న హైదరాబాద్‌లోని 8 ప్రదేశాలలో ED సోదాలు నిర్వహించింది.

రాజకీయ నేతల ప్రమేయం బయటకు వస్తుందా ?

ఈడీ ప్రకటన తెలంగాణలో సంచలనం సృష్టించనుంది. వెయ్యి కోట్ల స్కాం అంటే చిన్న విషయం కాదని ఇందులో రాజకీయ నేతల ప్రమేయం ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ తదుపరి దర్యాప్తులో ఈ అంశంపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు.. ఓఎస్డీగా ఉన్న కల్యాణ్ కుమార్ ఈ స్కాంలో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బులు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. ఈ కారణంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కొత్త సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. ప్రభుత్వం మారినప్పుడు కల్యాణ్ కుమార్ పెద్ద ఎత్తున డాక్యుమెంట్లను తరలిస్తూ దొరికిపోయారు. కొన్ని డాక్యుమెంట్లను ధ్వంసం చేసినట్లుగా గుర్తించారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏసీబీ ద్వారా విచారణ జరుపుతోంది. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి వెయ్యి కోట్ల స్కాం అనిచెప్పడంతో .. ఏసీబీ కూడా దూకుడుగా దర్యాప్తు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాయి.