RS Praveen Kumar resigned from BSP : బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు హఠాత్తుగా ప్రవీణ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకోవడంతో రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరి.. నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయించుకున్నారు.ఈ మేరకు ముందుగానే కేసీఆర్ తో సంప్రదింపులు జరిపారు. తర్వాత మాయవతి ఎవరితోనూ పొత్తులు ఉండవని లక్నోలో ప్రకటించారు. కానీ తర్వాత.. కేసీఆర్ ఏ కూటమిలో లేనందున ఆయనతో పొత్తులు పెట్టుకునేలా ఒప్పించారు. ఈ మేరకు లక్నో నుంచి పార్టీ ప్రతినిధి వచ్చి కేసీఆర్ తో చర్చించారు. కేసీఆర్ హైదరాబాద్, నాగర్ కర్నూలు ఎంపీ స్థానాలను బీఎస్పీకి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
అయితే హఠాత్తుగా ప్రవీణ్ కుమార్ తన పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ తో సమావేశమయ్యారు. కేసీఆర్ ఇస్తామన్న సీట్ల ప్రతిపాదనలతో మాయవతి సంతృప్తి చెందలేదని అందుకే పొత్తు వద్దన్నారని చెబుతున్నారు. మాయవతి నిర్ణయంతో అసంతృప్తికి గురైన ప్రవీణ్ కుమార్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ తరపునే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఐపీఎస్ అధికారిగా ఉండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని .. రాజకీయాల్లోకి వచ్చారు. బీఎస్పీలో చేరి.. పార్టీని బలోపేతం చేసేందుకు విస్తృతంగా శ్రమించారు. అయితే గత ఎన్నికల్లో ఆయన అనుకున్న ఫలితాలను సాధించలేకపోయారు. స్వయంగా సిర్పూరులో పోటీ చేసినా గెలవలేదు.
అయితే బీఎస్పీని దళితల పార్టీగా మార్చే విషయంలో ఆయన గట్టిగా ప్రయత్నించారు. తాను ఐపీఎస్ గా విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రోత్సహించిన స్వేరో అనే సంస్థ ద్వారా పార్టీని బలోపేతం చేయాలనుకున్నారు. కానీ రాజకీయ అధికారం లేకపోతే.. ప్రజాప్రతినిధిగా లేకపోతే కష్టమని భావించి.. ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు. పొత్తులు లేకపోతే గెలవడం కష్టమని నేరుగా.. బీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.