Telangana Police Constable Jobs: తెలంగాణ పోలీస్ నియామక మండలి (TSLPRB) నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనా తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని కొందరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ సమయంలో నమోదైన కేసులతో పాటు చిన్న చిన్న విషయాలలో కేసులు నమోదయ్యాయని.. కొందరిపై నమోదైన కేసుల్లో నిర్దోషిగా తేలినా కాంగ్రెస్ ప్రభుత్వం తమ జీవితాలను ఆగం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి చర్యలు తీసుకుంటే, తమ కుటుంబాలకు మేలు చేసిన వారవుతారని బాధిత అభ్యర్థులు కోరుతున్నారు. ఈ అవకాశం పోతే, తమకు ఏజ్ లిమిట్ దాటిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఆ అభ్యర్థులకు అండగా నిలిచిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 
రాష్ట్ర పోలీస్ నియామక మండలి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలు, ఈవెంట్లలో ఉత్తీర్ణత సాధించినా కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదు. అయితే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన సుమారు 1500 మంది అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో తీరని అన్యాయానికి గురవుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలంగాణలో ఈ బాధిత అభ్యర్థుల కన్నీళ్లు తుడిచే నాధుడే లేడు అంటూ బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. 


పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) రాష్ట్ర వ్యాప్తంగా సివిల్, ఏఆర్,ఎస్‌ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ విభాగాల్లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. కానీ కొందరు అభ్యర్ధులు తమ స్వీయ ధృవీకరణ (Self Attestation) పత్రంలో తమపై నమోదైన సివిల్, క్రిమినల్, బైండోవర్, కరోనా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన కేసులు ఉన్నట్లు తెలిపారు. ఆ అభ్యర్థులపై నమోదైన కేసుల్లో వారు విద్యార్థి దశలో చేసిన విద్యార్థి ఉద్యమ కేసులు, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే కుటుంబ తగాదాలతో కక్షపూరితంగా,ఉద్దేశపూర్వకంగా నమోదైన కేసులే అత్యధికం ఉన్నాయన్నారు. 


నిర్దోషిగా తేలినా జాబ్స్ ఇవ్వడం లేదు
పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన కొందరు అభ్యర్థులపై నమోదైన కేసుల్లో కొన్నింటిపై తీర్పు వచ్చి, కోర్టుల్లో నిర్దోషిగా తేలినా జాబ్స్ ఇవ్వడం లేదు. స్పెషల్ బ్రాంచ్ (SB) అధికారుల తుది పరిశీలనలో కూడా అభ్యర్థులు ఆ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలతోపాటు, కేసుల్లో నిర్దోషిగా తేలిన కోర్టు జడ్జిమెంట్ కాఫీలను స్వయంగా అభ్యర్ధులు స్పెషల్ బ్రాంచ్ అధికారులకు, 
TSLPRB  అధికారులకు అందించారు. కానీ ఆ అభ్యర్థులకు మిగతా ఎంపికైన అభ్యర్థులలాగ పోలీస్ శిక్షణకు అవకాశం కల్పించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులపై ఇంత చులకనభావం ఎందుకు? అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 14 న L.B స్టేడియంలో ఎంతో ఆర్భాటంగా అందజేసిన ఎంపిక పత్రాల్లో చాలా మంది అభ్యర్థులకు మొండి 'చేయి' చూపారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అని, కాంగ్రెస్ సర్కార్ బాధ్యతా రహిత్యమే అంటూ మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.


యూపీఎస్సీ (UPSC) నిర్వహించే ఉద్యోగ నియామకాల్లో స్వీయ ధృవీకరణ పత్రంలో పేర్కొన్న కేసుల్లో స్పెషల్ బ్రాంచ్ (SB), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారుల తుది పరిశీలనలో నిర్దోషిగా తేలితే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కావడంతో ఎంపికైన అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు.


కానిస్టేబుల్ గా ఎంపికైన అభ్యర్థులు ట్రైనింగ్ కోసం ఆర్డర్ కాపీలు ఇవ్వాలంటూ సీఎం నివాసం, డీజీపీ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అసలు తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా? ఆ అభ్యర్థుల మనోవేదనపై రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి స్పెషల్ బ్రాంచ్ (SB) పరిశీలనలో నిర్దోషిగా తేలిన అభ్యర్థులను శిక్షణకు పంపేలా TSLPRB  చైర్మన్ కు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.