TCS Layoffs News: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐటీ సెక్టార్‌లో లేఆఫ్‌లు (Layoffs in Tech Sector) ట్రెండ్ కొనసాగుతోంది. బడా కంపెనీలన్నీ వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే TCS కంపెనీపై అమెరికన్లు మండి పడుతున్నారు. ఇండియన్స్‌కి అవకాశం ఇచ్చేందుకు తమని ఉద్యోగం నుంచి తొలగించిందంటూ ఆరోపిస్తున్నారు. అంతే కాదు. కంపెనీ తమపై జాతి వివక్ష చూపిస్తోందని, వయసైపోయిందని కావాలనే తమని తొలగించిందని చెబుతున్నారు. 20 మంది ఉద్యోగులు ఈ ఆరోపణలు చేస్తున్నట్టు అమెరికాలోని The Wall Street Journal వెల్లడించింది. అయితే...ఈ సంఖ్య 22 వరకూ ఉందని మరి కొన్ని స్థానిక మీడియా సంస్థలు చెబుతున్నాయి. H-1B వీసాల ద్వారా ఇండియా నుంచి కొంత మంది ఉద్యోగులను పిలిపించిందని, వాళ్లకి ఇక్కడ అవకాశం ఇచ్చేందుకు ఆ మేరకు 22 మంది అమెరికన్లను తొలగించిందని వాదిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయిన వాళ్లలో అంతా 40-60 ఏళ్ల మధ్య వయసు వాళ్లే ఉన్నారు. MBA సహా అడ్వాన్స్‌డ్ డిగ్రీలు చేసిన వాళ్లనీ TCS తొలగించిందని ఫిర్యాదు అందింది. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా తమపై వివక్ష చూపిస్తున్నారంటూ మండి పడుతున్నారు బాధితులు. కేవలం H-1B వీసాల పేరు చెప్పి ఇలాంటి చర్యలకు పాల్పడడం సరి కాదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే...ఈ ఆరోపణల్ని టీసీఎస్ కొట్టి పారేసింది. కొంత మందిపై వివక్ష చూపించి ఉద్యోగం నుంచి తొలగించామనడం సరికాదని తేల్చి చెప్పింది. 


"నిబంధనలకు విరుద్ధంగా, వివక్ష చూపించి మరీ మేం కొంత మందిని ఉద్యోగం నుంచి తొలగించామన్న ఆరోపణలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. అమెరికాలో అందరికీ సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో టీసీఎస్‌ ప్రత్యేక ట్రాక్ రికార్డ్ ఉంది. ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగానే మా కంపెనీ ఎప్పటికీ పని చేస్తుంది. వాటికి కట్టుబడి ఉంటుంది"


- టీసీఎస్ యాజమాన్యం