Government Issues Advisory Against Cyber Frauds: ఎవరైనా వ్యక్తి మీ మొబైల్ ఫోన్‌కి కాల్ చేసి, తాను టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (Department Of Telecommunications) నుంచి కాల్ చేస్తున్నానని చెప్పి, మీ మొబైల్ నంబర్‌ను నిలిపేస్తామని బెదిరిస్తే.. అది తప్పకుండా మోసపూరిత కాల్‌ కావచ్చు. మిమ్మల్ని ఎరగా మార్చి డబ్బులు దండుకునే కుట్ర అయివుండవచ్చు. అలాంటి మోసగాళ్ల కాల్స్‌ ఈ మధ్య విపరీతంగా పెరిగాయి, జాగ్రత్తగా ఉండండి. 


ఈ తరహా మోసపూరిత కాల్స్‌ గురించి ప్రజలను హెచ్చరిస్తూ.. కేంద్ర కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వ శాఖ ఒక సలహా పత్రం (Advisory) జారీ చేసింది. అలాంటి కాల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారని, తద్వారా సైబర్ నేరాలు లేదా మోసాలకు పాల్పడవచ్చని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అంతేకాదు, మీ మొబైల్ నంబర్‌ను అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించారని చెప్పి భయపెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. 


టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ అధికారిని అని చెప్పుకుంటూ, తన మొబైల్ నంబర్‌ను డిస్‌కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్న కాల్స్‌ తమకు వస్తున్నాయని చాలా మంది ప్రజలు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. దీంతో, పౌరులకు జాగ్రత్తలు చెబుతూ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. +92తో ప్రారంభమయ్యే నంబర్లు సహా ఏ విదేశీ నంబర్ల నుంచి మామూలు కాల్స్‌ లేదా వాట్సాప్ కాల్స్‌ వచ్చినా జాగ్రత్తగా వ్యవహరించాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం స్పష్టం చేసింది. సదరు కాలర్ ప్రభుత్వ అధికారిగా నటిస్తూ వినియోగదార్లను మోసం చేస్తున్నట్లు తెలిపింది.


సైబర్ నేరాలు లేదా ఆర్థిక మోసాలకు పాల్పడేందుకు, తెరచాటు కేటుగాళ్లు ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రిత్వ శాఖ అలెర్ట్‌ చేసింది. మొబైల్‌ నంబర్‌ను నిలిపేస్తామని హెచ్చరిస్తూ మొబైల్ వినియోగదార్లకు కాల్ చేయడానికి ఏ అధికారికీ తాము అనుమతి ఇవ్వలేదని టెలికమ్యూనికేషన్స్ విభాగం స్పష్టం చేసింది. పౌరులు అలాంటి ఫోన్‌ కాల్స్‌ గురించి జాగ్రత్తగా ఉండాలని, అపరిచితులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్‌ సూచించింది.


మోసపూరిత ఫోన్‌ కాల్స్ వస్తే, టెలీకమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ సంచార్ సాథీ పోర్టల్‌ www.sancharsaathi.gov.in లో ఫిర్యాదు చేయమని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. దీనివల్ల, సైబర్ మోసం లేదా నేరాలను నిరోధించడంలో టెలికాం విభాగానికి సాయం చేసినట్లు అవుతుందని తెలిపింది. పౌరులు హెల్ప్‌లైన్ నంబర్ 1930 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


ఒకవేళ, టెలికాం ఆఫీసర్‌ను అని చెప్పుకుంటూ ఎవరైనా మీకు ఫోన్‌ చేస్తే.. మొదట చేయాల్సిన పని మీరు ఆందోళన పడకుండా ఉండడం. మీ మొబైల్‌ నంబర్‌ చెప్పి, అవతలి వ్యక్తి ఎంత భయపెట్టాలని చూసినా మీరు స్థిమితంగా ఉండాలి. మిమ్మల్ని కంగారు పెట్టి మీ వ్యక్తిగత సమాచారం లాగడమే అపరిచిత కాలర్‌ లక్ష్యం. ఇందుకోసం మీరు చేసిన కొన్ని పనుల గురించి చెప్పి, నమ్మించడానికి ప్రయత్నిస్తాడు. మీరు అతని బుట్టలో పడేలా మాట్లాడతాడు లేదా భయపెడతాడు. అతని మాటలు నమ్మి లొంగిపోయాక మీ వ్యక్తిగత సమాచారం తెలుసుకుంటాడు. ఆ సమాచారంతో మీ బ్యాంక్‌ ఖాతాను ఖాళీ చేస్తాడు. 


వాస్తవానికి, టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఎవరూ ఇలాంటి కాల్స్‌ చేయరు. కాబట్టి, ఈ తరహా కాల్స్‌ వస్తే అవి మోసపూరిత కాల్స్‌ అని గట్టిగా నమ్మండి, వెంటనే డిస్‌కనెక్ట్‌ చేయండి. ఆ తర్వాత, సంచార్ సాథీ పోర్టల్‌ www.sancharsaathi.gov.in లో లేదా హెల్ప్‌లైన్ నంబర్ 1930 ద్వారా ఫిర్యాదు చేయండి. మీరు ఎంత తెలివిగా వ్యవహరిస్తే, మీ కష్టార్జితం అంత భద్రంగా ఉంటుందని గుర్తుంచుకోండి.


మరో ఆసక్తికర కథనం: ఈ రేట్లు ఇండియన్స్‌ను ఆపలేవు, నగల డిమాండ్‌ పెరుగుటయేగానీ విరుగుట కల్ల!