Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పును ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టు రిజర్వులో ఉంచింది. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ తనను అరెస్ట్ చేసినందున అందులో బెయిల్ కోసం కవిత ప్రయత్నిస్తున్నారు. వీటిలో కవిత అరెస్టును సవాల్ చేస్తూ.. రౌస్ అవెన్యూ కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్‌పై సోమవారం (ఏప్రిల్ 22) వాదనలు జరిగాయి. కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. మరోవైపు, సీబీఐ అరెస్ట్ విషయంలో బెయిల్ పిటిషన్‌పై తీర్పును సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా మే 2వ తేదీకి రిజర్వ్ చేశారు.
కవిత తరఫు నాయవ్యాది వాదనలు వినిపిస్తూ.. మహిళగా కల్వకుంట్ల కవిత బెయిల్‌కు అర్హురాలని వాదించారు. ఆమె అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి సాక్ష్యం లేదని అన్నారు. కవిత అరెస్ట్‌కు సరైన ఆధారాలు లేవని.. ఆధారాలు లేకుండానే కవితను అరెస్ట్ చేశారని సింఘ్వి వాదించారు. ఈడీ కస్టడీలో ఉండగానే ఎందుకు సీబీఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారని.. అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. తమ రాజకీయ పార్టీకి కవిత స్టార్ క్యాంపైనర్ అని.. ఇప్పుడు ఆమె ప్రతిపక్షంలో ఉన్నారని వాదించారు. ఆమె పార్టీ రూలింగ్‌లో ఉన్నప్పుడే కేసును ప్రభావితం చేయలేదని గుర్తు చేశారు. ఏడేళ్ల లోపల పడే శిక్ష ఉన్న కేసులో అరెస్ట్ అవసరం లేదని న్యాయవాది వాదించారు.
సీబీఐ వాదనలు ఇవీ..
కవితకు వ్యతిరేకంగా సీబీఐ వాదనలు వినిపిస్తూ.. లిక్కర్ కేసును కవిత ప్రభావితం చేయగలరని వాదించారు. లిక్కర్ స్కాం కేసులో కవిత కీలకంగా ఉన్నారని.. బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని అన్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని కూడా కోర్టుకు తెలిపారు. లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్ అని.. కవితకు బెయిల్ ఇవ్వొద్దని అన్నారు.
లిక్కర్ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తీహార్ జైలులో కవిత ఉన్నారు. మళ్లీ ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ కూడా అదే కేసులో కవితను అరెస్టు చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు కవిత తీహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీలో ఉండనున్నారు. ఈ రెండు కేసుల్లో బెయిల్ కోసం కవిత కోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ కావేరి భవేజా ధర్మాసనం సోమవారం తీర్పును రిజర్వు చేసింది.