Rouse Avenue Court Reserves Verdict On Kavitha Cbi Custody: ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi liquor Case) ఎమ్మెల్సీ కవితను (Mlc Kavitha) సీబీఐ కస్టడీకి అప్పగించాలన్న పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆమెను గురువారం అరెస్ట్ చేసిన సీబీఐ శుక్రవారం ఉదయం కోర్టులో హాజరుపరిచింది. దీనిపై విచారించిన న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. కవితను 5 రోజుల కస్టడీకి అప్పగించాలని.. ఆమె నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. దీంతో కోర్టు రూం నుంచి కవితను అధికారులు తీసుకెళ్తుండగా కవిత మాట్లాడారు.
కవిత ఏమన్నారంటే.?
తనను సీబీఐ అరెస్ట్ చేయడం అక్రమమని కవిత అన్నారు. 'న్యాయ సలహా కావాలని అడిగినా నన్ను అరెస్ట్ చేశారు. నన్ను సీబీఐ అరెస్ట్ చేస్తున్నారనే విషయాన్ని రాత్రి 10:30కు చెప్పారు. మా లాయర్లతో మాట్లాడాలని చెప్పాను' అని పేర్కొన్నారు. అటు, కోర్టులో కవిత తరఫున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సీబీఐ కవితను అరెస్ట్ చేసిందని చెప్పారు. ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారని.. హక్కులు కాపాడాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తన అరెస్టను వ్యతిరేకిస్తూ కవిత 2 పిటిషన్లు దాఖలు చేయగా.. సీబీఐ కస్టడీ పిటిషన్ పై లంచ్ తర్వాత వాదనలు ప్రారంభం కానున్నాయి.
సీబీఐ ఏం చెప్పిందంటే.?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత కీలక సూత్రధారి అని సీబీఐ పేర్కొంది. 'అప్రూవర్ మాగుంట, శరత్ చంద్ర సెక్షన్ 161. 164 కింద కవిత పాత్రపై వాంగ్మూలం ఇచ్చారు. అయినా కవిత దర్యాప్తునకు సహకరించడం లేదు. మా వద్ద ఉన్న ఆధారాలతో ఆమెను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి. గతంలో ఆమెను విచారణకు పిలిచినా హాజరు కాలేదు. అభిషేక్ బోయినపల్లి భారీ ఎత్తున డబ్బు హవాలా రూపంలో చెల్లించారు. ఈ డబ్బును గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్లు సమీకరించినట్లు వాట్సాప్ చాట్ ధృవీకరిస్తోంది.' అని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు కోర్టుకు అందజేశామని పేర్కొంది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
మద్యం పాలసీ కేసులో గత నెల 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో కవితను అరెస్ట్ చేశారు. ఆమె కస్టడీని ఇప్పటికే మూడు సార్లు పొడిగించింది కోర్టు. కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఆమె బయటకు రావాలంటే ఈడీ కేసులోనే కాదు సీబీఐ కేసు లోనూ బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.