Cbi Custody To Kavitha In Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆమెను 3 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ నెల 15 వరకూ ఆమెకు సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ప్రతి రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకూ కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు కవితను కోర్టులో హాజరు పరచాలని న్యాయమూర్తి సీబీఐను ఆదేశించారు. దీంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ తన కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న కవితను గురువారం సీబీఐ అరెస్ట్ చేసింది. ఆమెను శుక్రవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు హాజరు పరిచారు. లిక్కర్ కేసుకు సంబంధించి ఆమెను విచారించాల్సిన అవసరం ఉందని.. 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని .. సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి అని.. విచారణకు ఆమె సహకరించడం లేదని.. అందుకే కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీనిపై విచారించిన న్యాయస్థానం ఆమెను 3 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.






కవిత పిటిషన్లు తోసిపుచ్చిన న్యాయస్థానం


అంతకు ముందు కవిత దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ తనను ప్రశ్నించడాన్ని, అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే సీబీఐ తనను ప్రశ్నించిందని.. అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడుగుతోందని కవిత తెలిపారు. తనను కస్టడీకి ఇవ్వొద్దని కోరారు. అయితే, సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆమెను కస్టడీకి అనుమతించింది. కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో కవితను అరెస్ట్ చేశారు. ఆమె కస్టడీని ఇప్పటికే మూడు సార్లు పొడిగించింది కోర్టు. కవిత రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సీబీఐ అరెస్ట్‌ చేయడం సంచలనంగా మారింది. కోర్టు తీర్పుతో కవితను సీబీఐ అధికారులు కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి పలు అంశాలపై ప్రశ్నించనున్నారు.


Also Read: Warangal BRS: వరంగల్ బీఅర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య! పిలిచి మరీ కేసీఆర్ ఛాన్స్?