Warangal BRS MP Candidate: వరంగల్ పార్లమెంట్ బీఅర్ఎస్ టిక్కెట్ ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠకు మరికాసేపట్లో తెరపడనుంది. అందరు ఊహించినట్టుగానే బీఅర్ఎస్ నుంచి వెళ్లిన మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను కేసీఆర్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించనున్నారు. రాజయ్యతో పార్టీ అధినేత కేసీఆర్ చర్చలు జరిపినట్లు సమాచారం. చర్చ అనంతరం పార్టీ కండువా కప్పి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా రాజయ్య ప్రకటించే అవకాశం ఉంది. 


బీఅర్ఎస్ నుంచి వెళ్లిన కడియం శ్రీహరి, కడియం కావ్యను ఎదుర్కోవడానికి తాటికొండ రాజయ్య అయితేనే కరెక్ట్ అని భావించిన కేసీఅర్.. ఆయనను పోటీలో ఉంచబోతున్నారు. తాటికొండ రాజయ్య రెండు నెలల క్రితం బీఅర్ఎస్ పార్టీని విడారు. కేసీఅర్ విధి విధానాలు నచ్చకపోవడంతో పాటు మాదిగలకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ పై విమర్శలు చేసి వెళ్ళారు. అయితే, రాజయ్య బీఅర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. 


కానీ కాంగ్రెస్ గేట్లు తెరుచుకోకపోవడంతోపాటు కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ లో చేరడంతో వెనక్కి తగ్గారు. ఈలోపు బీఅర్ఎస్ నుండి పిలుపు రావడంతో రాజయ్య సైతం తిరిగి పార్టీలో చేరడానికి ఆసక్తి చూపారు. దీంతో కేసీఆర్ పార్టీ లోకి ఆహ్వానించి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఈ రోజు ప్రకటన రానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.