Rouse Avenue Court adjourns arguments on bail of BRS MLC Kavitha- న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఏప్రిల్ 4కి వాయిదా పడింది. ఏప్రిల్ 4న మధ్యాహ్నం 2:30కి రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. సుదీర్ఘ వాదనలు, ఈడీ రిప్లై రిజాయిన్డర్ కు అభిషేక్ మను సింఘ్వి మరింత సమయం కోరారు. దాంతో కవిత తరపు న్యాయవాదులు ఏప్రిల్ 3న సాయంత్రానికి రిజాయిన్డర్ దాఖలు చేస్తామని తెలిపారు. కుమారులకు పరీక్షలు ఉన్నాయని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే.







తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని తనకు ఈ నెల 16 వరకు బెయిల్‌ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవిత గత నెల (మార్చి 26న) ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. కవిత కేసు విచారణను సైతం కోర్టు వాయిదా వేసింది. మార్చి 15న హైదరాబాద్‌లోని తన నివాసంలో ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు విచారణ చేపట్టిన అనంతరం కవితను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు తరలించారు. మరుసటి రోజు రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా.. ఈడీ 10 రోజుల కస్టడీకి కోరగా 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మార్చి 23న ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు మరో 5 రోజుల కస్టడీకి కోరగా.. 3 రోజుల కస్టడీకి ఇచ్చింది కోర్టు. దాంతో మార్చి 26న అధికారులు కోర్టులో హాజరు పరచగా  కవితకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించగా తిహార్ జైలుకు తరలించారు.