Revanth Reddy will inaugurate key schemes Before the election schedule :   తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయింది.  మార్చ్ 5న సంగారెడ్డిలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే మీటింగ్ కు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. అక్కడ అధికారిక కార్యక్రమాల్లో  పాల్గొంటారు. తర్వతా ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారసభలోనూ పాల్గొంటారు. రేవంత్ రెడ్డి ఆరో తేదీ నుంచి తీలిక లేని ప్రచార కార్యక్రమాలను ఖరారు చేసుకున్నారు.        


ఆరో తేదీన మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం  ప్రారంభం                     


 6న మహబూబ్ నగర్ పర్యటనలో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంను ఆయన ప్రారంభించనున్నారు.   స్థానిక ఎంవీఎస్ కాలేజీలో జరిగే పాలమూరు ప్రజాదీవెన సభలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఈ సభలో పాలమూరు జిల్లాకు మరిన్ని వరాలు ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారు.  7వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. అలాగే, కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇక, మార్చ్ 7వ తేదీన వేములవాడ రాజరాజేశ్వరి ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు.                  


వరుసగా అభివృద్ధి పనులు, పథకాల ప్రారంభోత్సవానికి జిల్లాల పర్యటనలు           


ఈనెల 8న ఓల్డ్ సిటీలో రెండో దశ మెట్రో పనులను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే, మార్చ్ 9వ తేదీన ఎల్బీనగర్ పరిధిలోని బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ను సీఎం ప్రారంభించనున్నారు. ఈనెల 11న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.. అక్కడ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక, ఈనెల 12న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో మహిళా సదస్సు కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక బృందాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.            


షెడ్యూల్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో  ఎన్నికల ప్రచారం                                                


ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా వరుసగా పది రోజుల పాటు పర్యటించనున్నారు. అన్నిరాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలతో  పాటు.. రాజకీయ బహిరంగసభల్లో పాల్గొననున్నారు పదమూడో తేదీ వరకూ  ఈ పర్యటనలను ఖరారు చేశారు. ఆ తర్వాత  లేదా.. అంతకు ముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి కూడా ఈ లోపే కీలక స్కీములను  ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. షెడ్యూల్ వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించి.. ఇక పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు.