హుజూరాబాద్‌లో అసలు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు . రెండు రోజుల కిందటే వస్తుందని రాజకీయ పార్టీలు హడావుడి పడ్డాయి. కానీ ఎన్నికల కమిషన్ నుంచి స్పందన లేదు. కానీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉపఎన్నికలు పెండింగ్‌లో ఉండటంతో నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యాచరణ ప్రకటించారు. అభ్యర్థిని కూడా ఖరారు చేశారు. హరీష్ రావును రంగంలోకి దింపారు. అంటే అక్కడ టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో బలగాలను మోహరిచిందన్నమాట. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ దాదాపుగా ఖరారరయ్యారు. ఆయన కాకపోతే ఆయన భార్య జమున అభ్యర్థి అవుతారు . కానీ ఈటల పోటీ చేయకపోతే .. ఆయన ఓడిపోతారని అందుకే ఆయన భార్యను నిలబెట్టారన్నప్రచారం జరుగుతుంది.
అందుకే ఈటలే అభ్యర్థిగా ఫైనల్ అవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా ఈటల లేకపోతే ఆయన భార్య అభ్యర్థి అవుతారు. అటు టీఆర్ఎస్.. ఇటు బీజేపీ వర్గాల్లో అభ్యర్థులపై క్లారిటీ ఉంది. కానీ.. కాంగ్రెస్ పార్టీలోనే అభ్యర్థి ఎవరో చూచాయగా కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా కౌశిక్ రెడ్డి ఉన్నారు.. ఆయన తర్వాత స్వర్గం రవి అనే నేత ఉన్నారు. వీరిద్దర్నీ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. ఒక వేళ అభ్యర్థిగాఎవర్నైనా ఖరారు చేసినా... వారిని కూడా ఆకర్షించేందుకు అధికారపార్టీ ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. అందుకే టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభ్యర్థి విషయంలో తొందరపడటం లేదు. కానీ ఏ ఒక్కఅభ్యర్థి పేరూ గట్టిగా వినపడకపోతూడటంతో ప్రజల్లో నెగెటివ్ ప్రచారం ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ రేసులో లేదేమోనన్న అభిప్రాయం కలగడానికి కారణం అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థే దొరకలేదని.. ఆ పార్టీతో అసలు పోటీ లేదని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అసలు పరీక్ష ప్రారంభమైనట్లు అయింది. దుబ్బాకలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చివరి క్షణం వరకూ ప్రకటించలేకపోయారు. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన నాయకత్వ పటిమను ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. గత యాభై ఏళ్లలో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవలేదు. ఆ కారణంతో తాము పోటీలో లేమని చెప్పడానికి కూడా చాన్స్ ఉండదు. ప్రతీ సారి గట్టి పోటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే.
ఇప్పుడు అక్కడ కనీసం రెండో స్థానంలో అయిన నిలబడకపోతే.. కాంగ్రెస్ పార్టీకి మరింత గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. అభ్యర్థి విషయంలో రేవంత్ రెడ్డి అంతర్గతంగా సర్వేలు నిర్వహించుకుంటున్నారు. అయితే దామోదర్ రాజనర్సింహ లేకపోతే కొండా సురేఖను బరిలోకి దించాలనే ఆలోచన చేస్తున్నారు. ఎవరినైనా సరే త్వరగా ఖరారు చేసి... ప్రచార బరిలోకి దిగితేనే ముక్కోణపు పోటీ అన్నట్లుగా చూస్తారని లేకపోతే... టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయం మారిపోతుందని అంటున్నారు. అదే జరిగితే.. రేవంత్‌కు పీసీసీ చీఫ్‌గా మొదటి భారీ ఎదురుదెబ్బ ఖాయమవుతుందని విశ్లేషిస్తున్నారు.