నా దేశాన్ని కాపాడండి అంటూ ప్రపంచ నేతల్ని కోరుతున్నాడు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్. అసలు ఏమైందంటే... ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లినప్పటి నుంచి ఆ దేశం తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్తోంది. దేశంలోని పలు ప్రాంతాలను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆ దేశ సైన్యం-తాలిబన్ల మధ్య యుద్ధంలో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదంతా చూసి క్రికెటర్ రషీద్ ఖాన్ తట్టుకోలేకపోతున్నాడు. 






గత నెలలో హెల్మాండ్, కాందహార్, హెరాత్ ప్రావిన్స్‌లలో తాలిబన్లు పౌరులపై జరిపిన దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే 1న అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రదాడులు తీవ్రమయ్యాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని 
దాదాపు 400 జిల్లాలో సగానికి పైగా తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆగష్టు 31 నాటికి  అమెరికా తన పూర్తి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 






ఈ నేపథ్యంలో ప్రపం‍చ దేశాల నేతలకు స్టార్‌ క్రికెటర్‌ రషీద్ ఖాన్ ట్విటర్ ద్వారా ఓ విజ్ఞప్తి చేశాడు. ప్రపంచ నేతలంతా ఏకమై తన దేశాన్ని రక్షించి, శాంతిని స్థాపించాలంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్ధించాడు. ‘నా దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రతిరోజూ వేలాది మంది అమాయకులు, పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇళ్లు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. వేలాది కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. మమ్మల్ని ఇలాంటి గందరగోళంలో పడేయవద్దు. మాకు శాంతి కావాలి. ఆఫ్ఘ‌న్ల హ‌త్య‌ల‌ను, ఆఫ్ఘనిస్థాన్ విధ్వంసాన్ని ఆపండి’ అంటూ ట్విటర్‌లో తన ఆవేదనను పంచుకున్నాడు. అంతేకాదు తన ట్విటర్ ద్వారా నిస్సహాయులకు సాయం చేసేందుకు ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాడు. ప్ర‌స్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లోని 65 శాతం భూభాగం మ‌ళ్లీ తాల‌బన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది.