Revanth vs Etela: మునుగోడు ఉపఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రూ. 25 కోట్లను సీఎం కేసీఆర్ వద్ద నుంచి తీసుకుందని బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి .. భాగ్యలక్ష్మి ఆలయంలో తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధమయ్యారు. ఆయన సాయంత్రం సమయంలో అనుచరులతో కలిసి భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని.. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేద్దామంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అన్ని విషయాలు అమ్మవారి టెంపుల్ దగ్గరే మాట్లాడుతానని ప్రకటించారు. ఆరోపణలు చేసేవారు భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలన్నారు.
రేవంత్ రెడ్డి సవాల్‌పై స్పందించని ఈటల రాజేందర్
అయితే ఇంత చర్చకు కారణమైన ఈటల రాజేందర్ మాత్రం ఇంకా స్పందించలేదు. అందుకు కేంద్రమంత్రి అమిత్ షా పర్యటనలో బిజీగా ఉండటమే కారణంగా చెబుతున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో అమిత్‌షా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు బిజీబిజీగా ఉన్నారు. అమిత్ పర్యటన నేపథ్యంలో రేవంత్ సవాల్‌పై స్పందించేది లేదని ఈటల రాజేందర్ చెబుతున్నారు. అమిత్ షా పర్యటన నుంచి దృష్టి మళ్లించేందుకు రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమిత్ షా చేవెళ్ల సభ పూర్తయిన తర్వాత ఈటల రాజేందర్ స్పందించే అవకాశం ఉంది.
భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భారీ భద్రత
భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు గుమికూడారు. అదే సమయంలో పోలీసులు కూడా భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. భాగ్యలక్ష్మి ఆలయం చార్మినార్‌ను ఆనుకునే ఉంటుంది. బీజేపీ నేతలు ఏ కార్యక్రమం ప్రారంభించినా సెంటిమెంట్ గా భాగ్యలక్ష్మి ఆలయం నుంచే ప్రారంభిస్తారు. ఈటల రాజేందర్ కూాడా బీజేపీ నాయకుడు కావడంతో రేవంత్ రెడ్డి తడి బట్టలతో ప్రమాణానికి భాగ్యలక్ష్మి టెంపుల్‌ను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై ఇతర బీజేపీ నేతల్లో డీకే అరుణ మాత్రమే స్పందించారు.
బీజేపీ నేతలకు సెంటిమెంట్ భాగ్యలక్ష్మి ఆలయం
రేవంత్ రెడ్డి ఇష్యూలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్‌కు వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ వత్తాసు పలకడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. వాస్తవాలు మాట్లాడితే రేవంత్ కు అంత ఉలిక్కిపాటు ఎందకని ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైంది వాస్తవం కాదా అని డీకే అరుణ ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ వివాదం అంతకంతకూ పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి.
బీజేపీ నేతలు ఎవరూ తన సవాల్‌కు స్పందించకపోతే రేవంత్ రెడ్డి తడి బట్టలతో ప్రమాణం చేసి మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. గతంలో బండి సంజయ్ కూడా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో యాదగురిగుట్టలో ఇలాగే తడి బట్టలతో ప్రమాణం చేశారు.