Revanth Reddy Comments: సిద్దిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరకపోతే శాశ్వతంగా బానిసత్వం వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆరునూరైనా మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవాలని పిలుపు ఇచ్చారు. మొదటిసారిగా కేసీఆర్ గడీలను బద్దలు కొట్టే అవకాశం వచ్చిందని అన్నారు. గత 45 ఏళ్లుగా సిద్దిపేటను మామ, అల్లుడు పాపాల భైరవుల్లా పట్టి పీడిస్తున్నారని అన్నారు. మామా, అల్లుడి నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పించడానికి వచ్చామని అన్నారు. సిద్దిపేటలో రేవంత్ రెడ్డి మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్, హరీశ్ రావు, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.


కలెక్టర్ గా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డి వందల ఎకరాలు కొల్లగొట్టారని అన్నారు. నిజాం దగ్గర ఖాసీం రిజ్వీ ఎలాగో కేసీఆర్ కు వెంకట్రామిరెడ్డి అలా అని సీఎం రేవంత్ అన్నారు. కరీంనగర్ కు చెందిన వ్యక్తిని మెదక్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నిలబెట్టిందని.. మెదక్ జిల్లాలో సమర్థుడైన అభ్యర్థి ఆ పార్టీకి ఎవరూ దొరకలేదా అంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. 


‘‘సిద్దిపేటలో మీటింగ్ పెడితే ఎవరూ రారేమో అని మా నేతలు అనుకున్నారు. కానీ, సిద్దిపేట పౌరుల పౌరుషాన్ని చూశాక నాకు సంపూర్ణమైన నమ్మకం కలిగింది. మెదక్ లోక్ సభలో నీలం మధు లక్ష మెజారిటీతో గెలుస్తారు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.