Revanth On BJP: దేశంలో విభజన తెచ్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గుజరాత్‌లో జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధేయ వాదులంతా ఏకం కావాలి.. మోదీ, గాడ్సే పరివారాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని.. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టినట్టే బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. నిజాం సర్కార్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించింది సర్దార్ వల్లభాయ్ పటేల్...తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అని గుర్తు చేసుకున్నారు. దేశమంతా కులగణన చేపట్టాలని రేవంత్ సభా వేదిక మీద నుంచి డిమాండ్ చేశారు. తెలంగాణలో కులగణన పూర్తి చేశాం ...రైతులకు రుణమాఫీ చేశాం.. రాహుల్‌కి ఇచ్చిన హామీని నెరవేర్చామని ప్రకటించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ ఇచ్చిన హామీ ఏమైంది..?..మోదీకి, అమిత్ షా కి ఉద్యోగాలు వచ్చాయి తప్ప యువతకు రాలేదన్నారు.
ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లోక్ సభలో మైక్ ఇవ్వకపోవడాన్ని రేవంత్ ప్రశ్నించారు. మోదీ వైఫల్యాలను ఎండగడతారన్న ఉద్దేశంతోనే ఆయనకు మైక్ ఇవ్వడం లేదన్నారు. దేశంలో మోదీ పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి మణిపూర్ సంక్షోభమే సాక్ష్యమని స్పష్టం చేశారు. మోదీని నమ్మి అధికారం కట్టబెడితే రైతులకు అన్యాయం చేశారన్నారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి రైతులను వంచించారన్నారు.
రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్రను నిర్వహించా రని.. ఈ సందర్భంగా, మహిళలు, యువతుకు పలు హామీలు ఇచ్చామన్నారు. వాటన్నింటినీ నెరవేస్తున్నామని తెలిపారు.
రాహుల్ గాంధీ కూడా తన ప్రసంగంలో తెలంగాణలో కులగణన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కులగణన తెలంగాణలో పక్కాగా పూర్తి చేశామని .. 90 శాతం ఓబీసీలు, దళితులు, మైనార్టీలే ఉన్నారన్నారు. కులగణనకు ఆరెస్సెస్ బీజేపీ వ్యతిరకమని ఆరోపించారు.