Finding Unclaimed Deposits In Banks: మన దేశంలోని బ్యాంకుల్లో రూ. 78,213 కోట్లకు పైగా అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఓ మూలనపడి మూలుగుతున్నాయి. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు అంటే యజమాని లేనివి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే,  బ్యాంకులో డిపాజిట్‌ చేసి విత్‌డ్రా చేసుకోవడం మర్చిపోయిన వాళ్లు లేదా ఆ ఖాతాను యాక్సెస్‌ చేయలేకపోయినవాళ్లు లేదా కావాలనే ఆ డబ్బును వదిలేసినవాళ్లు లేదా కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మరణించినవాళ్లకు సంబంధించినది ఈ డబ్బు. 


ఇప్పుడు  రూ. 78,213 కోట్లకు పైగా అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు వాటి నిజమైన యజమానుల వద్దకు చేరబోతున్నాయి. ఒకవేళ, డిపాజిట్‌ చేసిన వ్యక్తి ఇప్పుడు జీవించి లేకపోతే, అతని/ఆమె చట్టబద్ధమైన వారసులు డబ్బును క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఖాతాల్లో ముగిరిపోతున్న కాసులను దాని సొంత వాళ్ల వద్దకు తిరిగి చేర్చడానికి, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) ఏప్రిల్ 01, 2025 నుంచి కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ వ్యవస్థలో.. బ్యాంకులు తమ వెబ్‌సైట్‌లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల పూర్తి వివరాలను ఉంచుతాయి. ఇందులో ఖాతాదారుడి పేరు & పబ్లిక్ సెర్చ్ ఫీచర్ కూడా ఉంటుంది.


కొత్త ప్రక్రియ ఏమిటి?
స్టాండర్డ్‌ ఫార్మాట్: ఇప్పుడు అన్ని బ్యాంకులు ఒకే రకమైన దరఖాస్తు ఫారాన్ని, పత్రాలను అడుగుతాయి.
ఆన్‌లైన్ సౌకర్యం: FY26 నాటికి పూర్తిగా ఆన్‌లైన్ క్లెయిమ్ వ్యవస్థ ప్రారంభం అవుతుంది.
సులభమైన ధృవీకరణ: ఫారం నింపిన తర్వాత, బ్యాంక్ శాఖ స్వయంగా కస్టమర్‌ను సంప్రదించి డబ్బును బదిలీ చేస్తుంది.


మీ అకౌంట్‌ ఉందో, లేదో ఎలా తనిఖీ చేయాలి?
ఇప్పటివరకు, క్లెయిమ్ చేయని డిపాజిట్లను తనిఖీ చేయడానికి కస్టమర్లు RBI కి చెందిన UDGAM పోర్టల్‌లోకి వెళ్లి చెక్ చేసేవాళ్లు. వాళ్లకు సంబంధించి ఏదైనా డిపాజిట్‌ ఉందని తేలితే, దానిని క్లెయిమ్ చేయడానికి సంబంధింత బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లేవాళ్లు. కొత్త వ్యవస్థలో ఈ ప్రక్రియ సులభంగా మారింది.


గత పదేళ్లలో ఒక్క లావాదేవీ కూడా జరగని ఖాతాలో ఉన్న డబ్బు లేదా మెచ్యూరిటీ పూర్తయిన పదేళ్ల వరకు క్లెయిమ్‌ చేయడని డబ్బును అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్‌గా పరిగణిస్తారు. ఈ డబ్బును బ్యాంక్‌లు RBI 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ ఫండ్' (DEA)కు బదిలీ చేస్తాయి. మార్చి 2024 వరకు ఉన్న డేటా ప్రకారం, DEAలో రూ. 78,213 కోట్లు జమ అయ్యాయి. ఈ మొత్తం, గత సంవత్సరం కంటే 26 శాతం ఎక్కువ. ఈ డబ్బును నిజమైన యజమానులు లేదా వారి వారసులకు తిరిగి ఇవ్వడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లు, బీమా కంపెనీలను ఆదేశించారు.


కొత్త నామినీ నియమం
బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024 ప్రకారం, ఇప్పుడు ఒక ఖాతాలో నలుగురు నామినీల పేర్లను యాడ్‌ చేయవచ్చు, గతంలో ఒక్క పేరుకు మాత్రమే అవకాశం ఉండేది. దీనివల్ల నిష్క్రియాత్మక ఖాతాల నుంచి డబ్బును తిరిగి పొందడం సులభం అవుతుంది.


అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్‌ను ఎలా కనిపెట్టాలి?
బ్యాంక్ వెబ్‌సైట్‌లో "అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు" విభాగంలోకి వెళ్లండి.
ఖాతాదారు పేరు, మొబైల్ నంబర్, చిరునామాతో ఫారం నింపండి.
ఈ వివరాలను బ్యాంక్ ధృవీకరించుకున్న తర్వాత మీ ఖాతాకు డబ్బు బదిలీ చేస్తుంది.