Revant Seetakka :  అమెరికాలోని తానా సభల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి అవసరమైతే సీతక్కను సీఎంను చేస్తామని ప్రకటించారు.  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.  కాంగ్రెస్ పార్టీలో దళితులు, గిరిజనులకు పెద్ద పీట వేస్తామని చెప్పే సందర్భంలో  అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే దళితులు, గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని రేవంత్‌ను ఎన్నారైలు కోరారు. దీనికి సమాధానంగా రేవంత్.. అవసరమైతే సీతక్కను సీఎం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, ఎస్సీ, ఎస్టీల పక్షాన నిలుస్తుందన్నారు. దళితుడైన మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ  దళితులు, గిరిజనులకు అనుకూలంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రులు కావొచ్చన్నారు. పని చేసే వారికి గౌరవం కచ్చితంగా దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో పైరవీలు చేసుకోవాల్సిన అవసరం లేదని రేవంత్ అన్నారు.                  


రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు యాధృచ్చికంగా అన్నవి కాదని తెలంగాణ కాంగ్రెస్ లో ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఇటీవలి కాలంలో తెలంగాణ కాంగ్రెస్ సీఎం పదవి సమీకరణాలపై విస్తృత చర్చ జరుగుతూండటమే. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సాధారణంగా  పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్  రెడ్డి ..సీఎం పదవి రేసులో ముందుంటారు. అయితే కర్ణాటకలో మాదిరిగా ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవరిని కోరుకుంటే వారిని సీఎం చేయాలనుకుంటే.. ఎవరు రేసులో ముందుకొస్తారో చెప్పడం కష్టం. అదే సమయంలో దళిత సీఎం నినాదాన్ని కొంత మంది కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు.                


మల్లు భట్టి విక్రమార్క పార్టీ కోసం పాదయాత్ర చేశారని.. అంటున్నారు. అదే సమయంలో గిరిజనలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని గిరిజనులను సీఎంను చేస్తే. . కాంగ్రెస్ చరిత్ర సృష్టిస్తుందన్న వాదన వినిపిస్తున్నారు. దీంతో  సీతక్క పేరు తెరపైకి వస్తోంది. రేవంత్ రెడ్డికి పదవి దక్కని పరిస్థితులు ఏర్పడితే..గిరిజన కోటాలో సీతక్కను సీఎం ను చేసేందుకు ప్రతిపాదిస్తారని..దానికి తగ్గట్లుగానే ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. భట్టి విక్రమార్కకు చెక్ పెట్టడం... తనకు కాకపోతే.. తన సోదరిగా చెప్పుకునే సీతక్కకు పదవి రావాలన్నది రేవంత్ ఆలోచన అన్న భావన వినిపిస్తోంది.           


అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో సీతక్క కూడా పాల్గొన్నారు. తానా నిర్వాహకులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యేగా సామాజిక సేవలో సీతక్క కు విస్తృత ప్రచారం లభించి ఉండటం.. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే నేత కావడంతో అక్కడి ప్రవాస తెలుగు ప్రజలు ఆమెతో సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. అమె పుట్టిన రోజు కూడా కావడంతో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.