దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ రేంజి ఓ రేంజిలో పెరిగిపోయింది. జక్కన్న చిత్రంతో దేశ వ్యాప్తంగా మార్కెట్ ను పెంచుకున్నారు రెబల్ స్టార్. ఈ సినిమా తర్వాత ఆయన అన్నీ పాన్ ఇండియన్ సినిమాలే చేస్తున్నారు. అయితే, ‘బాహుబలి’ తర్వాత వచ్చిన పాన్ ఇండియన్ సినిమాలు ఏవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ‘సాహో, రాధేశ్యామ్’, ‘ఆది పురుష్’ చిత్రాలు ఎంతో ఆర్భాటంగా విడుదలైనా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి ‘సలార్’ సినిమా చేస్తున్నారు. అటు ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్ K’ లోనూ నటిస్తున్నారు. అటు మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ‘సలార్’ టీజర్
ఇక రీసెంట్ గా విడుదలైన ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలోని ‘సలార్’ మూవీ టీజర్ దేశ వ్యాప్తంగా సంచనలం సృష్టించింది. ఈ టీజర్ చూసి అభిమానులు ఉప్పొంగిపోయారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ పీరియాడికల్ డ్రామా టీజర్ చూసిన వారికి గూస్ బంప్స్ తెప్పించారు ప్రశాంత్ నీల్. జులై 6, గురువారం విడుదలైన సలార్ టీజర్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ రాబట్టి సరికొత్త ప్రభంజనం సృష్టించింది. హైయెస్ట్ వ్యూస్ సాధించిన ఇండియన్ టీజర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక టీజర్ తో సినిమాపై ఉన్న అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి.
‘సలార్’ ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారంటే?
గత కొద్ది కాలం ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు ప్రభాస్. ఈ సినిమాకు కూడా ఆయన రూ. 100 కోట్లు పారితోషికం అందుకుంటున్నారట. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా తన స్థానాన్ని మళ్లీ సుస్థిరం చేసుకున్నారట ప్రభాస్. అంతేకాదు, ఈ సినిమా బాక్సాఫీస్ లాభాల్లో 10% అదనంగా ప్రభాస్ అందుకోబోతున్నారట. తన ఇటీవలి చిత్రం ‘ఆదిపురుష్’ కోసం, శ్రీరాముడి పాత్రను పోషించినందుకు రెబల్ స్టార్ రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నారు.
'సలార్' పార్ట్ -1 సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని మాఫియా, గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో శృతిహాసన్ 'ఆధ్య' అనే జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగంధూర్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు. రవి బాస్రూర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు, మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ కుమార్ విలన్ పాత్రలు పోషిస్తున్నారు. ఇక రెండు భాగాలుగా 'సలార్' మూవీ రాబోతుందని తాజాగా విడుదల చేసిన టీజర్ లో స్పష్టం చేశారు మేకర్స్. 'సలార్' పార్ట్ -1 ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 28న విడుదల కానుంది.
Read Also: ‘జవాన్‘ ట్రైలర్: ఏ హీరో నా ముందు నిలబడలేడంటూ గుండుతో షాకిచ్చిన షారుఖ్ ఖాన్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial