కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ప్రస్తుత తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీకి పొన్నాల రాజీనామా చేయడం అతి పెద్ద నేరం అని రేవంత్ రెడ్డి ఖండించారు. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉండి కూడా 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన చరిత్ర ఆయనదని అన్నారు. ఇప్పుడు పార్టీ మారడానికి పొన్నాలకు సిగ్గుండాలని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో శుక్రవారం (అక్టోబరు 13) రాత్రి కాంగ్రెస్‌ కేం‍ద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. దాదాపు రెండున్నర గంటలపాటు చర్చించి అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 


ఈ సమావేశం తర్వాత రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చేసిన తప్పునకు కాంగ్రెస్ పార్టీకి క్షమాపణలు చెప్పాలని, పొన్నాల తక్షణమే తన రాజీనామాను వెనక్కు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు, బీసీలకు కాంగ్రెస్‌ పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించడాన్ని రేవంత్‌ రెడ్డి ఖండించారు. బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌ ఈసారి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇస్తుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకే 50 శాతం సీట్లు ఇస్తామని రేవంత్‌ చెప్పారు. 


అభ్యర్థులపై స్పష్టత
దాదాపు 50 శాతం సీట్లు ఓ కొలిక్కి వచ్చాయని మిగిలినవి తొందర్లోనే ఖరారు చేస్తామని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు తోడుగా ప్రజాస్వామ్యం అనే గ్యారంటీ ఇస్తున్నామని అన్నారు. ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుందని రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.