వన్డే ప్రపంచకప్‌లో అసలు సిసలు సమరానికి..... రంగం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానమైన అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో దాయాదుల పోరు జరగనుంది. ప్రపంచకప్‌లోనే  హైఓల్టేజీ మ్యాచ్‌ అయిన ఈ పోరులో...... ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య భీకర పోరు జరగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. అయితే పాక్‌ మాజీ పేసర్‌, రావిల్పిండి ఎక్స్‌ప్రెస్‌ అభిమానులను హెచ్చరించాడు. భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ను చూడాలంటే దమ్ము ఉండాలని షోయబ్‌ అక్తర్ వ్యాఖ్యానించాడు. మీరు ధైర్యవంతులైతేనే.. ఈ పోరును ఎంజాయ్‌ చేస్తారని కామెంట్‌ చేశాడు. ఒకవేళ మీరు పిరికివాళ్లైతే ఈ మ్యాచ్‌ను చూడకపోవడమే మంచిదని అక్తర్ హితవు పలికాడు. ఆటగాళ్లు సూపర్ స్టార్లుగా మారేందుకు ఈ మ్యాచ్‌ ఒక అరుదైన అవకాశమన్న రావిల్పిండి ఎక్స్‌ప్రెస్‌... పాకిస్థాన్‌పై తీవ్ర ఒత్తిడి ఉంటుందనేది అవాస్తవమని తన జట్టును వెనకేసుకు వచ్చాడు. భారత్‌ను ఫేవరెట్‌గా పరిగణించడం వల్ల పాక్‌పై ఒత్తిడి లేకుండా పోతుందని తన మార్క్‌ విశ్లేషణ చేశాడు. 



  టీమిండియాను ఫేవరెట్‌గా చూసినప్పుడు పాకిస్థాన్‌ జట్టు అండర్‌డాగ్‌గానే బరిలోకి దిగుతుందని అక్తర్‌ అన్నాడు. ఇప్పుడు పాకిస్థాన్‌ కోల్పేయేదీ ఏమీ లేదని.. కానీ భారత జట్టు పరిస్థితి అలా లేదని ఈ పాక్‌ మాజీ పేసర్‌ అన్నాడు. భారత్‌ను వారి సొంత గడ్డమీదే ఓడించి ప్రపంచకప్‌ గెలిస్తే ఆ మజానే వేరని అక్తర్‌ అన్నాడు. కానీ భారత్‌ను భారత్‌లో ఓడించడం అంత సులువు కాదని అన్నాడు. పాకిస్థాన్‌ జట్టు ఈ మ్యాచ్‌లో చాలా తెలివిగా ఆడాలని రావిల్పిండి ఎక్స్‌ప్రెస్‌ సూచించాడు. భారత వికెట్లపై భారత్‌ను ఓడించి అహ్మదాబాద్‌లో ఫైనల్‌ ఆడుతుంటే చూడాలని ఉందని కూడా అక్తర్‌ వ్యాఖ్యానించాడు. 



 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ రేపు తలపడతాయి. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఓటమి ఎరుగని భారత్ జట్టు ఇదే ఒరవడి కొనసాగించేలా వ్యూహరచన చేస్తోంది. పాక్‌ జట్టు కూడా పరాజయ పరంపరకు అడ్డుకట్ట వేసేందుకు కసరత్తు చేస్తోంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఇరుజట్లు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. బ్యాటింగ్ విభాగంలో  సారథి రోహిత్‌, విరాట్‌ కోహ్లీ, KL రాహుల్‌ మంచి ఫామ్‌లో ఉండడం సహా బౌలింగ్‌ విభాగంలో బుమ్రా మెరుపులు భారత్‌ను ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గా నిలిపాయి. 1992 నుంచి ఇప్పటివరకూ ఇరు జట్లు ఏడుసార్లు తలపడగా అన్నిసార్లూ భారత్‌ విజయం సాధించింది. తాజా ప్రపంచకప్‌లోనూ ఇదే జోరు కొనసాగించాలని రోహిత్‌ సేన ఉవ్విళ్లురుతోంది. 



 బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా ఈ మ్యాచ్‌లో భారత్‌ జట్టు ఫేవరేట్‌గా కనిపిస్తోంది. డెంగీ నుంచి కోలుకున్న శుభ్‌మన్‌ గిల్ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. అయితే పాక్‌తో మ్యాచ్‌లో గిల్‌ ఆడడంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ శుభ్‌మన్‌ తుది జట్టులో లేకపోతే ఇషాన్‌ కిషన్‌కు మరో అవకాశం దక్కనుంది. చాలా ఏళ్ల తర్వాత భారత్‌లో దాయాదుల సమరం జరుగుతుండగా మ్యాచ్‌ జరిగేఅహ్మదాబాద్‌లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్‌ను సుమారు లక్ష మంది ప్రేక్షకులు వీక్షించే అవకాశం ఉంది.