ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో కమ్యూనిస్టులను పట్టించుకోకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల కోసం వారితో కలిసి పని చేసి, అక్కడ బీఆర్ఎస్ గెలుపొందింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారితో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ కొన్ని సందర్భాల్లో చెప్పారు. కానీ, అనూహ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో వారి ఊసే ఎత్తలేదు. దీనిపై తాజాగా రేవంత్ రెడ్డి స్పందించారు. 


బీజేపీతో ఉన్న అనుబంధంతోనే కమ్యూనిస్టులను కేసీఆర్ వదిలేశారని రేవంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం (ఆగస్టు 23) ఆయన గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ నుంచి జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన హుగ్గెల్లి రాములు, పలువురు కార్యకర్తలు కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు.


తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ బొందలగడ్డలా మారిందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో 60 వేల బెల్టు షాపులు ఉన్నాయని, దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో ఇన్ని బెల్ట్ షాపులు లేవని, అందులో తెలంగాణ నెంబర్ వన్ అన్నారు. వైన్‌ షాపుల టెండర్ల పేరుతో రూ.2,600 కోట్లు కేసీఆర్‌ కొల్లగొట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మిస్తే, కేసీఆర్‌ రూ.7,500 కోట్లకు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలోని ప్రతి సాగునీటి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని అన్నారు. 


కేసీఆర్‌కు సూటిగా సవాల్‌ విసురుతున్నానని, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోట బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దని, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇచ్చిన చోట కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని కేసీఆర్‌ తుంగలో తొక్కారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కమ్యూనిస్టులను కరివేపాకులా వాడుకుని వదిలేశారని. అందుకే ఏకపక్షంగా టికెట్లు కేటాయించుకున్నారని విమర్శించారు. 


కాంగ్రెస్‌ తెలంగాణకు ఏం చేసిందో నాగార్జున సాగర్‌ కట్టమీద చర్చిద్దామా? అంటూ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. చరిత్ర తిరగేసి చూస్తే కాంగ్రెస్‌ ఏం చేసిందో తెలుస్తుందన్నారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కామారెడ్డిలో 22వ ప్యాకేజీ పనులు పూర్తి కాలేదని, కామారెడ్డికి గోదావరి నీళ్లు తెస్తేనే కేసీఆర్‌ కామారెడ్డిలో అడుగుపెట్టాలన్నారు. 


కాంగ్రెస్‌ హయాంలో పదేళ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. విభనజ నాటికి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒక్కటే అన్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ మాత్రమే అన్నారు. 26న చేవెళ్లలో జరిగే సభను విజయవంతం చేయాలని రేవంత్‌రెడ్డి కోరారు. 


దళితుడిని అయినందునే నన్ను అవమానించారు - చంద్రశేఖర్
అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ను ఓడించడం తెలంగాణలో ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు.  దళితుడిననే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనను అవమానించాడని అన్నారు. తాను దళితుడినని, అందుకే తాను తెచ్చిన శాలువాని అమిత్ షా తీసుకోలేదన్నారు. 70 ఏళ్ల తరువాత కూడా ఇంకా అస్పృశ్యత, అసమానత్వం కొనసాగుతోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే 4 శాతం రిజర్వేషన్స్ తీసేస్తామని చెప్పడం నాకు బాధ కలిగించింది. 


అన్ని వర్గాలను ఆరాధించే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. 14 ఏళ్ల ఉద్యమం తరువాత తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. రాష్ట్రం కోసం ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి రాజీనామా చేశానని, రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి పాద నమస్కారం చేద్దామని కేసీఆర్‌కి చెప్పానని, ఆయన నిరాకరించడంతో తాను వెళ్లానన్నారు. వికారాబాద్ ప్రజలు నన్ను 5సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశారని అన్నారు. ఇప్పుడు వికారాబాద్ వదిలి జహీరాబాద్ వెళ్తున్నానని చెప్పారు.