Revanth Reddy: సన్నాసుల్లారా! నేను మోదీని లోపలింట్ల కలవలే, నిధులు రాకుంటే ఉతికి ఆరేస్తా - రేవంత్ రెడ్డి

ABP Desam Updated at: 06 Mar 2024 09:27 PM (IST)

Telangana News: మహబూబ్ నగర్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజా దీవెన సభ నిర్వహించింది. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

పాలమూరు ప్రజా దీవెన సభలో రేవంత్ రెడ్డి

NEXT PREV

Revanth Reddy Speech in Mahabub Nagar: కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ధర్మంగా రావాల్సిన నిధులు రాకపోతే ఉతికి ఆరేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో అయినా కేడీతో అయినా కొట్లాడతానని స్పష్టం చేశారు. తాను మోదీపై చూపే మర్యాద మన రాష్ట్రానికి మంచి జరగడం కోసమేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి.. ప్రజలకు మంచిది కాదని రేవంత్ రెడ్డి చెప్పారు.



సన్నాసుల్లారా.. నేను మోదీని లోపలింట్ల కలవలేదు. ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదు. అతిధి మన ఇంటికి వస్తే.. గౌరవించాలని వెళ్లాను. నా ప్రజల కోసమే  ప్రధాని మోడీని బహిరంగంగా నిధులు అడిగాను. మనం అడిగిన నిధులు ఇవ్వకపోతే బీజేపీని చీల్చి చెండాడుదాం- రేవంత్ రెడ్డి


మహబూబ్ నగర్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజా దీవెన సభ నిర్వహించింది. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రధాని మోదీకి తాను వినతి పత్రం ఇస్తే కొందరు విమర్శిస్తున్నారని.. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా తనపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తానని అన్నారు. 



రేవంత్ మోదీకి ఎందుకు వినతిపత్రాలు ఇచ్చావని కొందరు సన్నాసులు మాట్లాడుతున్నారు. నేనేం ఇంట్లోకి వెళ్లి తలుపు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్లు పట్టుకోలేదు. చెవిలో గుస గుసలు చెప్పలేదు. బాజాప్త ప్రధాని మన రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యత నెరవేర్చా. అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను బలంగా నమ్మిన. మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదు.. మర్యాద ఇస్తే మన గౌరవం పెరుగుతుంది.- రేవంత్ రెడ్డి


కేటీఆర్‌, హరీశ్‌రావును చూస్తే.. బీఆర్ఎస్ ‘బిల్లా రంగా సమితి’ అనిపిస్తుంది. పాలమూరు ప్రజలు ఇచ్చిన అండతో దేశంలోని మోదీ, రాష్ట్రంలోని కేడీతోనైనా కొట్లాడతాను. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడి నుంచి వంశీచందర్‌ రెడ్డిని ఎంపీగా, జీవన్‌ రెడ్డిని పాలమూరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించండి’’ అని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.


బీఆర్ఎస్ పై విమర్శలు


పదవి పోయి మతి భ్రమించి బీఆరెస్ నాయకులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. 3650 రోజులు అధికారంలో ఉన్న కేడీ, మోదీ రాష్ట్రానికి ఏం చేశారు. పాలమూరులో విద్య కోసం వైద్యం కోసం.. ఉద్యోగాల కోసం ఉపాధికోసం.. సాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. పాలమూరును అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత నాది. నేను మీ బిడ్డను.. ఈ మట్టిలో పుట్టా... పాలమూరును దేశంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చి దిద్దుతా. తాగితే ఒకటి దిగితే ఇంకోటి మాట్లాడటానికి నేను కేసీఆర్ ను కాదు... నేను మీ రేవంతన్నను. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే ఆరోగ్యం బాగాలేదని హరీష్ చెబుతుండు.


ఆరోగ్యం బాగలేనోడు మరి నల్లగొండ సభకు ఎట్ల పోయిండు. ఈ నెల 11న ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల్లో విశ్వాసం కలిగించాం. పదేళ్లలో తెలంగాణను కేసీఆర్ విధ్వంసం చేస్తే.. ఒక్కొక్క శకలాన్ని తొలగించి తెలంగాణను పునర్నిర్మాణం చేస్తున్నాం. కేసీఆర్ పదేళ్లు సీఎం గా ఉండొచ్చు.. మోదీ పదేళ్లు ప్రధానిగా ఉండచ్చు. కానీ పేదోళ్ల ప్రభుత్వం.. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆరునెలల్లో పడగొడుతారట. విజ్ఞులు ఆలోచన చేయాలి... దుర్మార్గ రాజకీయాలను పాతరేయాలి. ఒక పాలమూరు రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే చూసి ఓర్వలేకపోతున్నారా? పాలమూరు బిడ్డలకు అర్హత లేదా? ఆ హక్కు లేదా? టచ్ చేసి చూడండి.. మా పాలమూరు బిడ్డలు అగ్ని కనికలౌతారు. కేసీఆర్... విను..  2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటుంది. ఇది మా కార్యకర్తల మీద ఆన.. పాలమూరు బిడ్డగా మాట ఇస్తున్నా.. పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం ఉంటది... పేదలకు అండగా ఉంటది’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

Published at: 06 Mar 2024 09:12 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.