Telangana CM Revanth Reddy :  తెలంగాణ ముఖ్యమంత్రిగా డిసెంబర్‌లోనే బాధ్యతలు చేపట్టినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మార్చిలో మధ్యంతర బడ్జెట్‌నే ప్రతిపాదించారు. కేంద్రం నుచి వచ్చే గ్రాంట్లు, లోక్ సభ ఎన్నికల తర్వాత పరిస్థితుల్ని బట్టి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాలనుకున్నారు. ఆ ప్రకారం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా పూర్తయిపోవడంతో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.

  


జూలై  నెలాఖరులోపు పూర్తి స్థాయి బడ్జెట్                                         


2024,-25 సంవత్సరానికి మొత్తం రూ.2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొత్తం బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు, మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా పేర్కొంది. ఎన్నికల హామీల అమలు కోసం ప్రభుత్వం రూ.53,196 కోట్లు ప్రతిపాదించింది. నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకుంది.  జూలై నెలాఖరులోపు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టి అనుమతి తీసుకోవాల్సి ఉంది.  ఉభయసభలు ఈ బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. 


రుణమాఫీకి నిధుల కేటాయింపు ముఖ్యం                                      
 
పార్లమెంట్ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేనులోపు ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.   రైతు రుణమాఫీకి రూ.30 వేల కోట్ల నుంచి  రూ.35,000 కోట్ల వరకు అవసరం కానున్నాయి. ఆ మొత్తం నిధులు కేటాయించి బడ్జెట్ రూపొందించాల్సి ఉంది.  నిధుల సేకరణకు ప్రణాళిక రూపొందించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో, ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. ఒక్క రుణమాఫీకే అంత మొత్తం కేటాయిస్తే ఇతర పథకాలపై ప్రభావం పడుతుంది. అందుకే ఇతర పథకాలపై ప్రభావం పడకుండా రుణమాఫీ చేయడంపై కసరత్తు చేస్తున్నారు. ల


మద్యం ధరల పెంపు, భూముల విలువ పెంపుపై ఆలోచనలు                                     


కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హామీల అమలుకు సమస్యలు ఉండవని రేవంత్ రెడ్డి భావిస్తూ వస్తున్నారు. అయితే అనుకున్నట్లుగా ఇండియా కూటమి అధికారంలోకి రాలేదు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు తప్ప కొత్తగా ఎలాంటి ఆదాయం ఉండదని స్పష్టమయింది. ఇప్పుడు అన్ని పథకాలతో పాటు రుణమాఫీకి నిధులు కేటాయించడం పెద్ద సవాల్‌గా మారనుంది. మద్యం  ధరలు పెంచడం, భూముల విలువలు పెంచడం వంటి వాటిపై కసరత్తు చేస్తున్నారు. వీటి వల్ల ప్రజా వ్యతిరేకత వ్తుందనే అంచనా ఉన్నా.. హామీల అమలుకు తప్పదని భావిస్తున్నారు.