Revanth Reddy Speech on Caste Census Survey: తెలంగాణ కులగణన సర్వే సమగ్రంగా జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ప్రజా ప్రతినిధిగా కులగణన సర్వే వివరాలను నివేదిక రూపంలో సభలో ప్రకటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇదొక చారిత్రాత్మకమైన సందర్భమని రాష్ట్రంలో 66 లక్షల 99 వేల 602 కుటుంబాల సమాచారాన్ని సర్వే ద్వారా సేకరించామని ప్రకటించారు.
మొత్తం తెలంగాణలో 96.9 శాతం సర్వే... డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి 36 రోజులు పట్టిందన్నారు. యావత్ దేశం తమ వైపు చూసేలా సర్వేను నిర్వహించామన్నారు. రాష్ట్రంలో ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, బీసీలు 46.25 శాతం, ముస్లిం మైనారిటీల్లో బీసీలు 10.08 శాతం, ముస్లింలతో సహా మొత్తం ఓసీలు 15.79 శాతం ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
రేవంత్ అసెంబ్లీలో ప్రకటించిన కులగణన సర్వేలో ముఖ్యమైన అంశాలు :
తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టాలని 04-02-2024 నిర్ణయించారు
10-10-2024న జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
సర్వేలో 75లో ప్రశ్నలు అడిగిన ఎన్యుమరేటర్లు
150 కుటుంబాలను బ్లాక్‌గా 94,261 ఎన్యుమరేషన్ బ్లాక్‌లుగా విభజించారు.
ప్రతి పది మంది ఎన్యురేటర్ల పర్యవేక్షణకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించారు.
సర్వే కోసం 1,03,889 మంది సిబ్బందిని నియమించారు.
6 నవంబర్ 2024న ఇంటింట సర్వే ప్రారంభమైంది.
మొదటి దశలో మూడు రోజుల పాటు హౌసింగ్ లిస్ట్ చేశారు.
రెండో దశలో నవంబర్ 9 నుంచి అసలు సర్వే ప్రారంభమైంది.
6.11.2024న ప్రారంభమైన సర్వే 25.12.2024 న 50 రోజుల్లో ముగిసింది.
1,12,15,134 కుటుంబాలపై సర్వే నిర్వహించారు. ఇందులో గ్రామాల్లో 66,99,602 - నగరాల్లో 45,15,532 కుటుంబాలు ఉన్నాయి.
సర్వేకు దూరంగా ఉన్న కుటుంబాలు -3,56,323
మొత్తం 3,54,77,554 మందిని సర్వే చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
సర్వే ప్రకారం ఎస్సీల సంఖ్య- 61,84,319 మంది(17.43శాతం)
సర్వే ప్రకారం ఎస్టీల సంఖ్య-37,05,929 మంది (10.45శాతం)
సర్వే ప్రకారం బీసీల(ముస్లింలుకాకుండా) సంఖ్య- 1,64,09,179 మంది(46.25శాతం)
సర్వే ప్రకారం ముస్లింల సంఖ్య- 44,57,012 మంది( 12.56శాతం)
సర్వే ప్రకారం ముస్లింలలో బీసీల సంఖ్య- 35,76,588 (10.08 శాతం)
సర్వే ప్రకారం ముస్లింలలో ఓసీల సంఖ్య- 8,80,424(2.48 శాతం)
సర్వే ప్రకారం రాష్ట్రంలో ఓసీల సంఖ్య- 56,01,539(15.79 శాతం)
సర్వే ప్రకారం ఓసీల్లో ముస్లింల సంఖ్య- 8,80,424 (2.48శాతం)
సర్వే ప్రకారం ఓసీల్లో నాన్‌ముస్లింల సంఖ్య- 47,21,115(13.31 శాతం
దేశంలో బలహీన వర్గాలకు సంబంధించి 1931 తర్వాత సమగ్ర సర్వే జరగలేదన్నారు. అందుకే భారత్ జోడోయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించిన సమయంలో రాష్ట్రంలో కులగణన చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన పై అసెంబ్లీలో తీర్మానం చేసి, సర్వే ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేయడమే కాక నేడు నివేదికను సభలో ప్రవేశపెట్టామన్నారు.
ప్రతి గ్రామంలో తండాల్లో ఎన్యుమరేటర్లు పకడ్బందీగా వివరాలను సేకరించారన్నారు. ప్రతి 150 ఇళ్లను ఒక యూనిట్ గా గుర్తించి ఎన్యుమరేటర్లను కేటాయించి వివరాలు సేకరించామని తెలిపారు. 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 36 రోజులు కష్టపడి ఈ నివేదికన రూపొందించారని, ఇందుకు రూ.160 కోట్లు ఖర్చు చేసి నిర్దిష్టమైన పకడ్బందీ నివేదిక రూపొందించినట్లు ప్రకటించారు. పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తర్వాత సభలో ప్రవేశపెట్టామన్నారు.