Shadnagar factory fire accident- షాద్ నగర్: షాద్ నగర్ లోని అల్విన్ ఫార్మా కంపెనీలో రెండు రోజుల కిందట భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురు కార్మికులను బాలుడు సాయిచరణ్ కాపాడటం తెలిసిందే. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అంత మంది ప్రాణాలు కాపాడిన సాహస బాలుడు సాయిచరణ్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. తల్లిదండ్రులతో కలిసి సాయిచరణ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కార్మికులను కాపాడటంలో ప్రదర్శించిన తెగింపు వివరాలను రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సాయి చరణ్ సాహసాన్ని మెచ్చుకున్న ఆయన శాలువా, పూల బొకేతో సన్మానించారు.
ఏప్రిల్ 26న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ శివారులోని అల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆ కంపెనీలో చాలా మంది కార్మికులు ఉన్నారు. మంటల వేడి తాళలేక కొందరు కార్మికులు బిల్డింగ్ పైనుంచి దూకేశారు. ఈ క్రమంలో ప్రమాదం నుంచి బయట పడేందుకు బాలుడు సాయిచరణ్ పై అంతస్తులో ఉన్న ఓ కిటికీకి తాడు కట్టాడు. ఆ తాడు ద్వారా కార్మికులు ఒక్కొక్కరుగా కిందకి దిగి 50 మంది ప్రాణాలు కాపాడుకున్నారు.
సరైన సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి అంత మంది ప్రాణాలు కాపాడిన సాయిచరణ్ ను పోలీసులు అభినందించారు. నందిగామకు చెందిన బాలుడు సాయిచరణ్ ఇటీవల పదవ తరగతి పూర్తి చేశాడు. అగ్ని ప్రమాదం నుంచి కార్మికులను కాపాడిన సాయిచరణ్ ను పోలీసులు శనివారం అభినందించారు. బాలుడి ధైర్య సాహసాలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు.