Revanth Reddy directed authorities to make arrangements for Naveen treatment: హైదరాబాద్: అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్న నవీన్ పరిస్థితిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చిన్న వయసులోనే క్యాన్సర్‌తో బాధపడుతున్న నవీన్ చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి నవీన్‌కు చికిత్స చేయిస్తుందని స్పష్టం చేశారు. నవీన్ వ్యాధి నుంచి కోలుకునే వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. త్వరగా కోలుకుని ఆరోగ్యవంతుడై మన మధ్యకు రావాలని రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.


సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్..
‘పిన్న వయసులోనే అరుదైన క్యాన్సర్‌‌తో పోరాడుతున్న నవీన్ సమస్య నా దృష్టికి వచ్చిన వెంటనే, అతడి కుటుంబ సభ్యుల్ని సంప్రదించి, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాను. ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి, చికిత్సకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తుంది. నవీన్‌కు పూర్తిగా నయమయ్యేంత వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా నిమ్స్ వైదుల్ని కోరాను. నవీన్‌ ఈ క్యాన్సర్‌ మహమ్మారిని జయించి, పూర్తి ఆరోగ్యవంతుడై మన మధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.






ఆరోగ్యశ్రీ వర్తించదు, సాయం చేయాలని రిక్వెస్ట్.. 
‘నవీన్ బ్లడ్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నాడు. హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. పరీక్షించిన వైద్యులు.. అక్కడ ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ కవర్ కాదని.. నవీన్ ను డిశ్ఛార్జ్ చేస్తామని అతడి తల్లిదండ్రులకు చెప్పారు. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఖర్చుతో కూడుకున్న పని కావడం, నవీన్ ది పేద కుటుంబం. దాంతో రాష్ట్ర ప్రభుత్వం నవీన్ కు చికిత్స అందించేందుకు సాయం చేయాలని కోరారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సాయం చేసి నవీన్ క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించాలని’ సోషల్ మీడియాలో కోరారు. హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సందర్భంగా తీసిన ఫొటోలను సైతం సీఎం రేవంత్ రెడ్డికి షేర్ చేశారు.