Kaleshwaram Project: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ వంతెన కుంగిన ఘటన కలకలం రేపుతోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు బయటపడటం ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు తలనొప్పిని తెచ్చిపెడుతోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని పార్టీలన్నీ ఎప్పటినుంచో ఆరోపిస్తుండగా.. ఇప్పుడు వంతెన కుంగిపోవడంతో విమర్శల దాడి మరింత పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పగా కట్టామని ఇంగ్లీష్ పత్రికల్లో కూడా ప్రచారం చేసుకున్న కేసీఆర్.. ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నిస్తోన్నారు.


మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటనపై ఆదివారం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ విజిలెన్స్ కూడా దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వరదలు లేవని, అయినా ఎందుకు కుంగిపోయిందని ప్రశ్నించారు. కాళేశ్వరం డిజైన్ రూపొందించానని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారని, కుంగిన తర్వాత మాత్రం తమకు సంబంధం లేదని అంటున్నారని విమర్శించారు. నాణ్యతలోపం వల్ల మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని, కేసీఆర్ గొప్ప ఇంజినీరుగా చెప్పుకుని రూ.లక్ష కోట్లు వృథా చేశారని రేవంత్ ఆరోపించారు.


కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసిపోయాయని, బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయినందునే కాళేశ్వరంపై కేంద్రం స్పందించట్లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాకపోతే కాళేశ్వరంపై కేంద్రం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్బుతమని గొప్పలు చెప్పారని, కేసీఆర్ ధనదాహానికి ఇప్పుడు ప్రాజెక్టు బలైపోయిందన్నారు. వరదలు లేకుండా ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయిందనేది కేసీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఎప్పటినుంచో చెబుతున్నారని, ప్రాజెక్టు డొల్లతనం, నిజస్వరూపం ఇప్పటికైనా బయటపడిందన్నారు.  ఇప్పటికైనా కేంద్రం స్పందించి విచారణ జరిపించాలని కోరుతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


అటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు అద్బుతమని కేసీఆర్, కేటీఆర్ పదే పదే అన్నారని, గత ఏడాది వరదల్లో పంపుహౌస్‌లు మునిగి భారీగా నష్టం జరిగిందని తెలిపారు. రూ.30 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారని, కేసీఆర్ చేసిన రీడిజైనింగ్ వల్లే కాళేశ్వరం నష్టదాయకంగా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి గుదిబండగా మారిందని, డిజైన్లు తానే రూపొందించానన్న కేసీఆర్.. ఇప్పుడు మాట్లాడరెందుకని ప్రశ్నించారు. అందరూ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు చూడాలంటూ ఆహ్వానించారని, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించాలన్నారు. ప్రాజెక్టులోని లోపాలేంటో తాము చెప్తామని, అద్బుతమేమిటో బీఆర్ఎస్ నేతలు చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించాలని గవర్నర్, సీఈసీని కోరుతున్నామన్నారు. నిపుణులతో కూడిన సీవీసీ వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు తెలుస్తాయని, ప్రాజెక్టు వద్దకు ఎవరూ వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. 


కాగా ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టులో బయటపడ్డ లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తోన్నాయి. దీని వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందని భావిస్తన్నాయి. మరి ప్రతిపక్షాల ఆరోపణలను బీఆర్ఎస్ ఎలా తిప్పికొడుతుందో చూడాలి.