Bharat Ratna PV Narasimha Rao: తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం అని కొనియాడారు. ఆయనకు ఈ అత్యున్నత పురస్కారం దక్కడం.. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం అని అన్నారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్ కె అద్వానీ, కర్పూరీ ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్ కు కూడా భారతరత్న రావడం సంతోషకరం అని అన్నారు.






పీవీకి భారతరత్న ప్రకటించడంపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. పీవీ నరసింహారావు రాజనీతిజ్ఞుడు అని, నైతిక విలువలు కలిగిన పండితుడని గుర్తు చేశారు. ఆయనకు భారతరత్న ఇవ్వడం తెలుగు ప్రజలందరికీ గౌరవం అని అన్నారు. రైతుల కోసం పాటుపడిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా భారతరత్న ప్రదానం చేయడం జాతి గర్వించదగ్గ విషయం అని సీఎం జగన్‌ స్పందించారు.


ఆ సంస్కరణలే నడిపించాయి - చంద్రబాబు
‘‘మాజీ ప్రధాన మంత్రి పీవీకి భారత రత్న ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ గర్వకారణం. ఆయన తిరుగులేని లీడర్, ఆర్థిక వేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు, బహుభాషావేత్త, మానవతావాది. పీవీ నాయకత్వం, మార్గదర్శకత్వం, ఆర్థిక సంస్కరణలు భారతదేశాన్ని కష్ట సమయాల్లో నడిపించాయి. మన గొప్ప దేశాన్ని ప్రపంచ వేదికపై ప్రత్యేకంగా చూపాయి’’ అని చంద్రబాబు స్పందించారు.


మోదీకి ధన్యవాదాలు - కేసీఆర్


భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యున్నత జాతీయ పురస్కారం భారత రత్న ప్రకటించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. పీవీకి భారత రత్న పురస్కారం ఇవ్వాలనే ప్రధాని నిర్ణయం తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగించింది’’ అని కేసీఆర్ అన్నారు. 


మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా - పురందేశ్వరి
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా దీనిపై స్పందించారు. ‘‘పీవీ నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్ కి మరణానంతరం భారతరత్న ప్రదానం చేశారు. నేను దానిని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను’’ అని అన్నారు. నిజమైన రాజనీతిజ్ఞుడు, నేల పుత్రుడు ఈ గౌరవానికి అర్హుడు పీవీ నరసింహారావు అని కొనియాడారు. భారతీయ వ్యవసాయ విధానంలో మెరుగైన ఫలితాలకు స్వామినాథన్ కృషి మరువలేనిదని పురందేశ్వరి అన్నారు. వీరికి భారతరత్న ప్రకటించడం పట్ల ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.


తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల సృష్టి కర్త, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహ రావుకి కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించడం పట్ల రాష్ట్ర ఐటి పరిశ్రమలు మరియు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తంచేశారు.